షార్జాలో ఘోరం: కర్ణాటక వ్యక్తి దారుణహత్య... 9 ముక్కలుగా నరికి కారులో పడేసి.. భార్యా, కొడుకు మిస్సింగ్ !

షార్జాలో ఘోరం: కర్ణాటక వ్యక్తి దారుణహత్య... 9 ముక్కలుగా నరికి కారులో పడేసి.. భార్యా, కొడుకు మిస్సింగ్ !

కర్ణాటకలోని ఉడుపి జిల్లాకు చెందిన అల్విన్ ప్రకాష్ కుందర్ అనే వ్యక్తి యూఏఈలోని షార్జాలో అత్యంత ఘోరంగా హత్యకు గురయ్యారు. అతన్ని  చంపి, మృతదేహాన్ని 9 ముక్కలుగా నరికి రెండు బ్యాగుల్లో పెట్టి ఒక కారులో పడేశారు. జూలై నెలలోనే ఈ దారుణం జరగగా, దాదాపు రెండు నెలల తర్వాత ఇప్పుడు ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు ఆయన భార్య, కుమారుడు కూడా కనిపించకుండా పోవడంతో ఈ కేసులో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

14 ఏళ్లుగా షార్జాలోనే:
ప్రకాష్ గత 14 ఏళ్లుగా షార్జా విమానాశ్రయంలో పనిచేస్తున్నాడు. ఆయనతో పాటు ఆయన భార్య టీనా కూడా అక్కడే స్కూల్  టీచర్‌గా పనిచేస్తోంది, పదో తరగతి చదువుతున్న కుమారుడు కూడా వారితోపాటే షార్జాలోనే నివసిస్తున్నారు.

భార్యాపిల్లల ఆచూకీ : 
ప్రకాష్ హత్యకు గురైనప్పటి నుంచి ఆయన భార్య టీనా,  కొడుకు కనిపించకుండా పోయారు. వారు షార్జా వదిలి ఇండియాకు వచ్చి ఉండవచ్చని ప్రచారం జరుగుతున్నప్పటికీ, వారెక్కడున్నారనేది ఇంకా స్పష్టత లేదు.

కేసు ఎలా వెలుగులోకి వచ్చిందంటే ?
జూలై 20వ తేదీన ప్రకాష్ సోదరుడు అనిల్ ఆయనకు ఫోన్ చేశాడు. సాధారణంగా ప్రకాష్ ఎప్పుడైనా వాయిస్ మెసేజ్ పంపేవాడు. కానీ ఈసారి "నేను బాగున్నాను" అని కేవలం ఒక టెక్స్ట్ మెసేజ్ రావడంతో కుటుంబికులకు అనుమానం వచ్చింది. ఒక వారం తర్వాత మళ్లీ ఫోన్ చేసినా ప్రకాష్ నుంచి ఎలాంటి స్పందనా లేదు. దాంతో ఆందోళన చెందిన అనిల్, షార్జాలో ఉన్న ప్రకాష్ స్నేహితుడు మనోహర్‌ను చూసిరమ్మని  కోరాడు.

ఇండియా వెళ్లాడంటూ ప్రచారం: 
మనోహర్.. ప్రకాష్ ఇంటికి వెళ్లగా, ఆయన ఇండియా వెళ్లాడని అక్కడ పనిచేసే వాచ్‌మన్ చెప్పాడు. కంపెనీ హెచ్‌ఆర్ (HR) కూడా మొదట్లో ప్రకాష్ ఇండియా వెళ్లాడనే సమాచారం ఇచ్చింది.

పాస్‌పోర్ట్ తో అసలు విషయం బయటకి: 
ప్రకాష్ ఇంటికి రాలేదని కుటుంబికులు చెప్పడంతో కంపెనీ అధికారులు పాస్‌పోర్ట్ వివరాలు చెక్  చేశారు. ప్రకాష్ షార్జా దాటి ఎక్కడికీ వెళ్లలేదని, ఇక్కడే ఉన్నాడని తేలింది. దీంతో ఆయన అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు  దర్యాప్తు & ప్రస్తుత పరిస్థితి
దీనిపై పోలీసులు గాలిస్తుండగా, ఒమన్ వైపు వెళ్లే మార్గంలో నిలిపి ఉంచిన ఒక కారులో రెండు సంచులు దొరికాయి. వాటిని విప్పి చూడగా ప్రకాష్ మృతదేహాన్ని 9 ముక్కలుగా నరికి ఉంచినట్లు గుర్తించారు.

ఈ దారుణంలో భార్య టీనా ప్రమేయం ఉండి ఉండవచ్చని కొంత అనుమానిస్తున్నప్పటికీ, దానికి సంబంధించి ఎలాంటి అధికారిక ఆధారాలు లేవు. భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నట్లు కూడా మాకు తెలియదని ప్రకాష్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

 ప్రకాష్ మృతదేహాన్ని ఇండియాకు తీసుకురావడానికి, అలాగే ఈ హత్య వెనుక అసలు నిందితులు ఎవరో తెలుసుకోవడానికి ఆయన కుటుంబం ఉడుపి ఎస్పీ (SP)ని కలిసి సహాయం కోరింది. అయితే షార్జా పోలీసుల అధికారిక రిపోర్ట్  కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.