హైదరాబాద్, వెలుగు: రేషన్ షాపుల ద్వారా బియ్యంతో పాటు 14 రకాల నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ నెల 15 నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఆయన శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
ప్రస్తుతం ఒక్కో వ్యక్తికి 6 కిలోల బియ్యం మాత్రమే ఇస్తున్నారని, దీంతో పాటు కందిపప్పు, వంట నూనె, కారం, పసుపు సహా మొత్తం 14 రకాల నిత్యావసర సరుకులు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగినా పేద కుటుంబాల ఆదాయం మాత్రం పెరగలేదన్నారు. దీంతో చాలా కుటుంబాలు సరైన పోషకాహారం తీసుకోలేక ఇబ్బందులు పడుతున్నాయని చెప్పారు. పేదల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రేషన్ షాపుల ద్వారా అన్ని రకాల సరుకులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
