- చాడ వెంకట్ రెడ్డి
భీమదేవరపల్లి, వెలుగు : మోదీ పాలనలో శ్రీరాముడికే రక్షణ లేకుండా పోయిందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు. సీపీఐ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో శుక్రవారం ప్రచార యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు.
కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీ కోసం రైతులు పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతులకు క్షమాపణ చెప్పడం వల్ల సమస్యలు పరిష్కారం కావని, రైతుల ప్రయోజనాల కోసం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రామరాజ్యం పేరుతో అధికారంలోకి వచ్చిన బీజేపీ హయాంలోనే విరాళాల పేరుతో చోరీలు జరుగుతున్నాయని ఆరోపించారు.
నేరచరిత్ర కలిగిన వ్యక్తులు రాజకీయాల్లో ఉండడం ఆందోళనకరమన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కర్ర బిక్షపతి, మండల కార్యదర్శి ఆదరి శ్రీనివాస్, రమేశ్, రైతు సంఘం నాయకుడు కొంగల రామచంద్రారెడ్డి, సీనియర్ నాయకుడు మద్దెల ఎల్లేశ్, ప్రజానాట్య మండలి కళాకారులు రవి, లక్ష్మి పాల్గొన్నారు.
