‘ప్యారడైజ్‌‌‌‌‌‌‌‌’ టికెట్‌‌‌‌‌‌‌‌ రేట్ల పెంపును పునః సమీక్షించండి..ప్రభుత్వానికి హైకోర్టు సూచన

‘ప్యారడైజ్‌‌‌‌‌‌‌‌’ టికెట్‌‌‌‌‌‌‌‌ రేట్ల పెంపును పునః సమీక్షించండి..ప్రభుత్వానికి హైకోర్టు సూచన

హైదరాబాద్, వెలుగు: ప్యారడైజ్‌‌‌‌‌‌‌‌ సినిమా టికెట్‌‌‌‌‌‌‌‌ ధరల పెంపునకు సంబంధించిన మెమోను పునఃసమీక్షించి, ఉపసంహరించే అంశాన్ని పరిశీలించాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. టికెట్‌‌‌‌‌‌‌‌ ధరల పెంపు మెమోను సవాల్ చేస్తూ దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌‌‌‌‌‌‌‌పై జస్టిస్‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌. వి. శ్రవణ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ మంగళవారం విచారణ చేపట్టారు. పిటిషనర్‌‌‌‌‌‌‌‌ తరఫు న్యాయవాది వాదిస్తూ..

చట్ట నిబంధనలకు విరుద్ధంగా మెమో జారీ చేశారని, ధరల పెంపుకు కారణాలు, సినిమా బడ్జెట్‌‌‌‌‌‌‌‌ వివరాలు వెల్లడించలేదని తెలిపారు. ప్రభుత్వ న్యాయవాది మహేశ్‌‌‌‌‌‌‌‌ రాజె స్పందిస్తూ.. ఇటీవల జారీ చేసిన జీవో ప్రకారమే మెమో ఇచ్చామని, దానిపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేయడానికి వీల్లేదని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం టికెట్‌‌‌‌‌‌‌‌ ధరల పెంపు కోరేవారు సినిమా విడుదలకు 90 రోజుల ముందు దరఖాస్తు చేసుకోవాలని న్యాయమూర్తి తెలిపారు.

దరఖాస్తును వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌లో ఉంచితే అభ్యంతరాలు ఉంటే తెలియజేసే అవకాశం ఉంటుందని వెల్లడించారు. అయితే, విడుదలకు రెండు, మూడు రోజుల ముందు మెమోలు జారీ చేయడం అలవాటుగా మారిందని వ్యాఖ్యానించారు. ‘ప్యారడైజ్‌‌‌‌‌‌‌‌’ టికెట్‌‌‌‌‌‌‌‌ ధరల పెంపు మెమోను పునఃసమీక్షించి ఉపసంహరించే అంశాన్ని హోంశాఖ ముఖ్యకార్యదర్శి విచక్షణకే వదిలేస్తున్నట్టు వివరించారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు.