గచ్చిబౌలి, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్‌కు సన్నిహితుడైన జోగినపల్లి సంతోష్‌కుమార్ ఆస్తులపై విచారణ జరపాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రమ్యారావు కోరారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆయన విచ్చలవిడిగా ఆస్తులు కూడబెట్టారని ఆరోపించారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. సంతోష్‌కుమార్ భార్య రోహిణి పేరుతో ఎలిగెన్స్ ఎంపవర్-2 పేరుతో భారీ భవనం ఉందన్నారు. ఎంపీ కాకముందు మిడ్‌మానేరు ప్రాజెక్టులో భూమి కోల్పోయినట్లు చూపించి బీసీల పేరిట, బీపీఎల్ కింద పరిహారం పొందారని పేర్కొన్నారు.
బీపీఎల్ కింద ఉన్న వ్యక్తికి వందల కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. 200 గజాల స్థలం నుంచి వందల కోట్ల రూపాయల ఆస్తులను ఎలా సంపాదించారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. సంతోష్‌కుమార్‌కు బినామీల పేర్లపై మరిన్ని ఆస్తులు ఉన్నాయని, వాటిపైనా దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందన్నారు. గత జనవరిలోనే ఈడీ, ఆదాయపు పన్ను శాఖలకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తన వద్ద ఉన్న ఆధారాలను సీఎం రేవంత్‌రెడ్డికి అందజేస్తానని పేర్కొన్నారు. సంతోష్‌కుమార్ ఆస్తులను దళితులకు పంచిపెట్టాలన్నారు. అంబేద్కర్ సాక్షిగా తెలంగాణ సమాజానికి ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్‌చేశారు.
