హైదరాబాద్, వెలుగు: గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్ కొండల్‌రెడ్డికి ప్రభుత్వం అండగా నిలిచింది. క్యాన్సర్‌తో బాధపడుతున్న కొండల్‌రెడ్డికి రూ.2,77,500 సీఎంఆర్‌ఎఫ్ చెక్కును శక్తి, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తన చేతుల మీదుగా అందజేశారు. 9 ఏండ్లుగా ఉబర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న కొండల్‌రెడ్డి అనారోగ్యం కారణంగా ప్రస్తుతం పనిచేయలేని పరిస్థితిలో ఉన్నారు.
ఆయనకు పాఠశాలకు వెళ్లే ఇద్దరు కుమార్తెలు ఉండగా, కొండల్‌రెడ్డి కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితిని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ప్రభుత్వం తక్షణమే స్పందించి సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందించిందని మంత్రి తెలిపారు. కొండల్‌రెడ్డికి పంజాగుట్టలోని నిమ్స్ హాస్పిటల్లో సంపూర్ణ చికిత్స అందించేలా సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ తెలిపారు.
కొండల్‌రెడ్డి చికిత్సకు ప్రభుత్వం అండగా నిలవడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కష్టసమయంలో తమకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి వివేక్ వెంకటస్వామికి కొండల్ రెడ్డి కుటుంబం ధన్యవాదాలు తెలిపింది.
