హరీశ్ పేదల భూములు లాక్కుండు : విప్ బల్మూరి వెంకట్ 

హరీశ్ పేదల భూములు లాక్కుండు : విప్ బల్మూరి వెంకట్ 

హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ కండ్లలో ఆనందం కోసం పేదల భూములు లాక్కుంటావా? అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుపై విప్ బల్మూరి వెంకట్ ఫైర్ అయ్యారు. మంగళవారం ఆయన సీఎల్పీలో మీడియాతో మాట్లాడారు. మామ పేరుతో పట్టా కోసం  ఒక సర్వే నెంబర్ కు ఇంకో సర్వే నెంబర్ వేసి ఆర్డీవోతో ఎన్ఓసీ తీసుకొని మంత్రిగా అధికార దుర్వినియోగానికి పాల్పడలేదా..అని ప్రశ్నించారు. 2009 నుంచి 2020 వరకు లేని ఆస్తులు 2023 ఎన్నికల అఫిడవిట్ లో హరీశ్ కు ఇన్ని వందల కోట్ల ఆస్తులు  ఎలా వచ్చాయని ప్రశ్నించారు.

ఈ డబ్బంతా కాళేశ్వరం ప్రాజెక్టులో దోచుకుందా..లేక, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి దోచుకుందా అనేది హరీశ్ రావు చెప్పాలని బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. ఇరిగేషన్ మంత్రిగా రంగనాయక సాగర్ ప్రాజెక్టు భూ సేకరణలో భూ దోపిడి సంగతేంటని ప్రశ్నించారు. అక్కడ ప్రభుత్వ భూమిలో కట్టుకున్న ఫామ్ హౌస్ సంగతి ఏంటని నిలదీశారు. సిద్దిపేట, కొండపాక మండలంలోని వెలికట్టలో మాజీ సైనికులకు కేటాయించిన భూములను ఎలా ఆక్రమించుకున్నావో చెప్పాలని హరీశ్ ను డిమాండ్​ చేశారు.