72వ జాతీయ సినీ అవార్డుల ప్రదానోత్సవ వేడుక మంగళవారం గుజరాత్‌లోని ఏక్తానగర్‌లో ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతులమీదుగా వివిధ విభాగాల్లో ఎంపికైన విజేతలు పురస్కారాలను అందుకున్నారు. 2024 ఏడాదికి గాను ఉత్తమ చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులతో సహా మొత్తం 92 మందిని ఈ వేదికపై సత్కరించారు. ఢిల్లీ వెలుపల నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.
ఐదు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రయాణంతో అలరించిన ప్రముఖ కన్నడ నటుడు అనంత్ నాగ్‌ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సన్మానించారు. ‘భ్రమయుగం’ చిత్రానికి గాను మలయాళ అగ్రనటుడు మమ్ముట్టి, ‘చందు ఛాంపియన్’ సినిమాకు బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ జాతీయ ఉత్తమ నటుడు పురస్కారాన్ని ఉమ్మడిగా అందుకున్నారు. మమ్ముట్టికి ఇది నాలుగో జాతీయ అవార్డు. ‘ఆర్టికల్ 370’ చిత్రంలో అద్భుత నటనకు యామి గౌతమ్ ఉత్తమ నటి పురస్కారాన్ని స్వీకరించారు.
ఇదే సినిమాకుగాను ఉత్తమ చిత్రం అవార్డు లభించగా నిర్మాత ఆదిత్యధర్ (దురంధర్ దర్శకుడు) అందుకున్నారు. రియల్ లైఫ్ కపుల్ అయిన యామి, ఆదిత్య ఇలా ఒకే వేదికపై చెరో అవార్డును అందుకోవడం ఆకట్టుకుంది. ఇక ఉత్తమ దర్శకుడిగా రాజ్‌కుమార్ పెరియసామి (అమరన్), ఉత్తమ నూతన దర్శకుడిగా రణదీప్ హుడా (స్వతంత్ర వీర్ సావర్కర్) పురస్కారాలు అందుకున్నారు.
టాలీవుడ్‌కు 9 జాతీయ అవార్డులు
తెలుగు సినిమా నుంచి ‘పుష్ప: ది రూల్ పార్ట్-2’కు బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే రైటర్‌గా సుకుమార్, ‘లక్కీ భాస్కర్’కు డైలాగ్ రైటర్‌గా వెంకీ అట్లూరి అవార్డులు అందుకున్నారు. ‘కల్కి 2898 AD’కు బెస్ట్ పాపులర్ ఫిల్మ్ ప్రొవైడింగ్ హోల్‌సమ్ ఎంటర్‌టైన్‌మెంట్ అవార్డు లభించగా దర్శకనిర్మాతలు నాగ్ అశ్విన్, అశ్వినీదత్ అవార్డును అందుకున్నారు. ఇదే సినిమాకు బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ అవార్డును నితిన్ జిహాన్ చౌదరి అందుకున్నారు.
బెస్ట్ తెలుగు ఫిల్మ్ అవార్డును ‘కమిటీ కుర్రోళ్లు’ సొంతం చేసుకోగా నిర్మాత నిహారిక కొణిదెల, దర్శకుడు యదు వంశీ, ఇదే చిత్రానికి బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్‌గా పి.రవికుమార్ అవార్డులను అందుకున్నారు. ఇక ‘35-చిన్న కథ కాదు’ బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్ అవార్డును గెలుచుకోగా దర్శకనిర్మాతలు నంద కిషోర్, సృజన్ యరబోలు పురస్కారాన్ని స్వీకరించారు. ఇదే చిత్రానికి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డును అరుణ్ దేవ్ పోతుల అందుకున్నాడు. ఇక ‘పుష్ప: ది రూల్ పార్ట్-2’కు బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా శీతల్ శర్మ అవార్డును అందుకున్నారు.
ధనుష్ డబుల్ ధమాకా
దర్శకుడిగా ‘రాయన్’ చిత్రానికి బెస్ట్ తమిళ్ ఫిల్మ్ అవార్డును అందుకున్న ధనుష్‌కు ‘కెప్టెన్ మిల్లర్’లో నటనకు స్పెషల్ మెన్షన్ లభించింది. అలాగే ఇదే చిత్రానికి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ప్రమోటింగ్ నేషనల్, సోషల్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ వాల్యూస్ అవార్డు కూడా దక్కింది. ‘అమరన్’ మూవీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌కు జీవీ ప్రకాష్ కుమార్ అవార్డును అందుకున్నారు.
