- పంటలకు నీళ్లివ్వమంటే స్పందించరా..?
- ప్రభుత్వాన్ని నిలదీసిన రామచందర్‌రావు
మహబూబ్‌నగర్/జడ్చర్ల టౌన్, వెలుగు: జూరాల నుంచి సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాజెక్ట్సందర్శనకు బయల్దేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రర్రావును పోలీసులు అరెస్ట్‌చేశారు. పార్టీ కేడర్‌తో కలిసి మంగళవారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌నుంచి బయల్దేరారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం దగ్గర బ్రేక్ ఫాస్ట్ చేసేందుకు ఆగారు. ఆయనతోపాటు ప్రాజెక్ట్ దగ్గరకు వెళ్లేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన బీజేపీ శ్రేణులు పెద్దసంఖ్యలో మాచారం వద్దకు చేరుకున్నారు.
అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు హోటల్నుంచి బయటకు వస్తున్న రామచందర్రావును అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, బీజేపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండడంతో రాంచందర్‌రావును అరెస్టు చేసి జడ్చర్ల సమీపంలోని డిస్ర్టిక్ ట్రైనింగ్ సెంటర్(డీటీసీ)కి తరలించారు. మధ్యాహ్నం తర్వాత ఆయనను విడుదల చేశారు. కాగా, రామచందర్‌రావు అరెస్ట్‌ను కేంద్రమంత్రి బండి సంజయ్, ఎంపీ. డీకే అరుణ ఖండించారు.
రైతుల కోసం పోరాడుతుంటే మమ్మల్సి అరెస్ట్ చేస్తారా..? రామచందర్‌రావు ఆగ్రహం
రైతుల కోసం పోరాడుతున్న తమను అరెస్ట్ చేయడం దారుణమని రామచందర్ రావు అన్నారు. విడుదలైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులను కలిసేందుకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. జూరాల ప్రాజెక్టులో నీళ్లు ఉన్నాయి.. కాబట్టే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కర్నాటకలోని నారాయణపూర్, ఆల్మట్టి ప్రాజెక్టుల్లో 97 శాతం నీరుందని, జూరాలలో కూడా ఐదు టీఎంసీల నీటి లభ్యత ఉందని వివరించారు.
