నగోయా: ఇండియా ఉషు ప్లేయర్ రోషిబినా దేవి నాయ్రోమ్ పతకం ఖాయం చేసుకుంది. విమెన్స్ 60 కేజీ క్వార్టర్‌ఫైనల్లో రోషిబినా.. చుమాన్ సిన్ (మకావ్)పై గెలిచి సెమీస్‌లోకి ప్రవేశించింది. పాయింట్ల ఆధిక్యం కారణంగా రోషిబినాను విజేతగా ప్రకటించారు. విమెన్స్ నంక్వాన్ అండ్ నాండావో ఫైనల్స్‌లో హంజబమ్ లాంగ్లెంటోంబి దేవి 9.403 పాయింట్లతో 9వ స్థానంలో నిలిచింది. మెన్స్ 56 కేజీల సాండా క్వార్టర్స్‌లో ఆర్యన్ 1–2తో సైదుల్లో అబురాషిటోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడాడు.
షూటింగ్‌లో నిరాశ
10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్సడ్ టీమ్ ఫైనల్లో ఎలవానిల్ వలారివన్–పార్థ్ మానే జోడీ నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. ఫైనల్లో ఈ ఇద్దరు 376.3 పాయింట్లు మాత్రమే సాధించారు. వ్యక్తిగత స్కీట్స్‌లో అనంతజీత్ సింగ్ నరుకా, రైజా దిల్లాన్ పతకం రేసులో నిలిచారు. క్వాలిఫికేషన్స్‌లో నరుకా 96, దిల్లాన్ 92 పాయింట్లు సాధించారు. పరినాజ్ ధాలివాల్ (89) కూడా ఫైనల్ రేసులో ఉంది. టీమ్ విభాగంలో ఐదో స్థానంలో ఉండగా, విమెన్స్ జట్టు మూడో స్థానంతో పతకం కోసం పోరాడుతోంది.
ఫైనల్లో ప్రణతి నాయక్
ఇండియా జిమ్నాస్ట్ ప్రణతి నాయక్.. ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ వాల్ట్ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వాలిఫికేషన్‌లో ప్రణతి వాల్ట్‌లో 13.000, రెండో వాల్ట్‌లో 12.443 పాయింట్లు సాధించింది. 12.916 పాయింట్ల సగటుతో ఓవరాల్‌గా ఏడో ప్లేస్‌లో నిలిచింది. మరోవైపు స్విమ్మింగ్‌లో ఇండియాకు నిరాశే ఎదురైంది. మెన్స్ 4X100 మీటర్ల మెడ్లే రిలే ఫైనల్లో ఉత్కర్ష్ పాటిల్, ధునుష్ సురేశ్, రోహిత్ బెనెడిక్టన్, ఆకాశ్ మణిలతో కూడిన ఇండియా టీమ్ 3:44.26 సెకన్లలో ఆఖరి స్థానంలో నిలిచింది. 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ ఫైనల్–బి కేటగిరీలో ఆర్యన్ నెహ్రా నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
సాక్షి, జాదుమణి ముందంజ
ఆసియా క్రీడల్లో ఇండియా బాక్సర్ల పంచ్ అదిరింది. విమెన్స్ 51 కేజీల విభాగంలో సాక్షి చౌదరి 5–0తో పారిస్ ఒలింపిక్ కాంస్య విజేత ఐరా విల్లెగాస్ (ఫిలిప్పీన్స్)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. భివాని బాక్సర్ తన పొడవును సమర్థంగా ఉపయోగించుకుని ప్రత్యర్థికి ఎలాంటి చాన్స్ ఇవ్వలేదు. మెన్స్ 55 కేజీల్లో జాదుమణి సింగ్ 5–0తో చంద్ర బహుదుర్ థాపా (నేపాల్)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధించాడు.
