- సొంతంగా యాంటీబయాటిక్స్ వాడొద్దు: సీడీఎస్సీవో
హైదరాబాద్, వెలుగు: డాక్టర్ల సలహా లేకుండా పెయిన్ కిల్లర్లు, యాంటీబయాటిక్స్ వాడితే కిడ్నీలు దెబ్బతిని దీర్ఘకాలిక రోగాల బారినపడే ప్రమాదం ఉందని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీవో) హెచ్చరించింది. ఈ మేరకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) డాక్టర్ రాజీవ్ సింగ్ రఘువంశీ రాష్ట్రాల డ్రగ్ కంట్రోలింగ్ అధికారులు, డాక్టర్లు, మెడికల్ షాపులకు సర్క్యులర్ పంపారు.
విచ్చలవిడిగా ఈ మందులు వాడితే భవిష్యత్తులో రోగాలు వచ్చినప్పుడు బ్యాక్టీరియా లొంగకుండా మందులు పనిచేయకుండా పోయే ముప్పు ఉందని తెలిపారు. జలుబు వంటి సాధారణ వైరల్ జ్వరాలకు యాంటీబయాటిక్స్ వేసుకోవద్దని, ఇంట్లో పాతవి మిగిలిపోయిన మందులు గానీ, ఇతరుల మందులు గానీ వాడొద్దని స్పష్టం చేశారు.
డాక్టర్ రాస్తేనే అమ్మాలి
డ్రగ్స్ చట్టం ప్రకారం.. పెయిన్ కిల్లర్లు షెడ్యూల్ హెచ్, యాంటీబయాటిక్స్ షెడ్యూల్ హెచ్1 కిందకు వస్తాయని, రిజిస్టర్డ్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాపుల వాళ్లు వీటిని ఎట్టిపరిస్థితుల్లో అమ్మొద్దని డీసీజీఐ ఆదేశించింది. డాక్టర్లు కూడా రోగుల వయసు, కిడ్నీల పరిస్థితిని చూశాకే అతి తక్కువ డోసులో, కొద్ది రోజులకే పెయిన్ కిల్లర్లు రాయాలని, అవసరం లేని కాంబినేషన్ మందులు ఇవ్వొద్దని సూచించింది.
