గట్టెక్కిన ఇండియా.. 2 రన్స్‌‌ తేడాతో జపాన్‌‌పై విజయం 

గట్టెక్కిన ఇండియా.. 2 రన్స్‌‌ తేడాతో జపాన్‌‌పై విజయం 

సానో: జపాన్‌‌తో జరిగిన చరిత్రాత్మక ఏకైక టీ20లో ఇండియా తృటిలో గట్టెక్కింది. వర్షం వల్ల ఐదు ఓవర్లకు కుదించిన మ్యాచ్‌‌లో అనుభవజ్ఞుడైన స్పిన్నర్‌‌ అక్షర్‌‌ పటేల్‌‌ టీమిండియాను కాపాడాడు. దాంతో మంగళవారం జరిగిన మ్యాచ్‌‌లో ఇండియా 2 రన్స్‌‌ స్వల్ప తేడాతో జపాన్‌‌పై గెలిచింది. 

టాస్‌‌ నెగ్గిన ఇండియా 5 ఓవర్లలో 32/4 స్కోరు చేసింది. ప్రతికూల వాతావరణం, పిచ్‌‌పై తేమ ఎక్కువగా ఉండటంతో బాల్‌‌ ఊహించిన దానికంటే ఎక్కువగా టర్న్‌‌ అయ్యింది. ఫలితంగా తొలి ఓవర్‌‌లో అభిషేక్‌‌ శర్మ (0) డకౌటయ్యాడు. రెండో ఓవర్‌‌లో సంజూ శాంసన్‌‌ (9), తర్వాతి ఓవర్‌‌లో ఇషాన్‌‌ కిషన్‌‌ (3) ఔటయ్యారు.

14/3 స్కోరుతో నిలిచిన ఇండియాను కెప్టెన్‌‌ శ్రేయస్‌‌ అయ్యర్‌‌ (16), తిలక్‌‌ వర్మ (1 నాటౌట్‌‌) సాయంతో ఆదుకున్నాడు. ఇన్నింగ్స్‌‌లో మూడు బౌండ్రీలు మాత్రమే వచ్చాయి. చార్లీ హరా హింజే 2, ఇబ్రహీం తకహషి, బెంజమిన్‌‌ ఇట్లో డేవిస్‌‌ చెరో వికెట్‌‌ పడగొట్టారు. ఛేజింగ్‌‌లో జపాన్‌‌ 30/3 స్కోరు చేసి ఓడింది. కెండిల్‌‌ ఫ్లెమింగ్‌‌ (12) టాప్‌‌ స్కోరర్‌‌. 

మూడో ఓవర్‌‌లో రవి బిష్ణోయ్‌‌ పది రన్స్‌‌, నాలుగో ఓవర్‌‌లో వాషింగ్టన్‌‌ సుందర్‌‌ (2/13) ఏడు రన్స్‌‌ ఇవ్వడంతో ఇండియా దాదాపుగా ఓటమి అంచుల్లో నిలిచింది. అయితే ఆఖరి ఓవర్‌‌లో విజయానికి 8 రన్స్‌‌ అవసరమైనప్పుడు అక్షర్‌‌.. బెంజమిన్‌‌ ఇంటో డేవిస్‌‌ (9 నాటౌట్‌‌), షిరాయ్‌‌ పాట్మోర్‌‌ (2 నాటౌట్‌‌)ను కట్టడి చేసి 6 రన్స్‌‌ మాత్రమే ఇచ్చి ఇండియాను గట్టెక్కించాడు.