బ్రహ్మోస్‌‌ డీజీగా జైతీర్థ్‌‌ నియామకం సరైనదే..  క్యాట్‌‌ ఉత్తర్వులను కొట్టివేసిన హైకోర్టు

బ్రహ్మోస్‌‌ డీజీగా జైతీర్థ్‌‌ నియామకం సరైనదే..  క్యాట్‌‌ ఉత్తర్వులను కొట్టివేసిన హైకోర్టు

హైదరాబాద్‌‌, వెలుగు: డీఆర్‌‌డీఓ బ్రహ్మోస్‌‌ డైరెక్టర్‌‌ జనరల్‌‌గా డాక్టర్‌‌ జైతీర్థ్‌‌ ఆర్‌‌. జోషి నియామకాన్ని హైకోర్టు సమర్థించింది. ఆయన నియామకం చెల్లదంటూ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌‌(క్యాట్‌‌) గత ఏడాది డిసెంబర్‌‌ 29న ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. తనకంటే జూనియర్‌‌ అయిన జైతీర్థ్‌‌ జోషిని డీజీగా నియమించడాన్ని సవాలు చేస్తూ డాక్టర్‌‌ శివసుబ్రమణియం నంబి నాయుడు క్యాట్‌‌ను ఆశ్రయించారు.

విచారణ అనంతరం జైతీర్థ్‌‌ నియామకాన్ని రద్దు చేసిన క్యాట్‌‌.. నంబి నాయుడు అభ్యర్థిత్వాన్ని పునఃపరిశీలించాలని కేంద్రాన్ని ఆదేశించింది. క్యాట్‌‌ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం, జైతీర్థ్‌‌ జోషి హైకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు. జస్టిస్‌‌ పి.శ్యాంకోశీ, జస్టిస్‌‌ నందికొండ నర్సింగ్‌‌రావుతో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యాలను విచారించింది.