యునైటెడ్ నేషన్స్ (న్యూయార్క్): యుద్ధం ముగించేందుకు ఇరాన్ ఒప్పందం కుదుర్చుకోవాలని, లేదంటే ఆ దేశాన్ని అంతం చేస్తామని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరించారు. ‘‘ఇరాన్ మాతో డీల్ చేసుకోకపోతే.. ఆ దేశాన్ని సర్వ నాశనం చేస్తాం. లేదంటే నరకానికి పంపుతాం”అని ఆయన అన్నారు. ఇరాన్ మళ్లీ కోలుకునేందుకు అవకాశం కల్పిస్తూ, ఒప్పందం చేసుకోవాలా? లేక మరింత సైనిక చర్యకు దిగాలా? అనే రెండు మార్గాలు తన ముందు ఉన్నాయన్నారు.
మంగళవారం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ట్రంప్ 37 నిమిషాల పాటు ప్రసంగించారు. ప్రైవేట్ రంగ ఉద్యోగాల కల్పన, అక్రమ వలసల నిరోధం, నేరాల కట్టడి వంటి అంశాలపై సాధించిన పురోగతిని వివరిస్తూ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఇరాన్‌తో యుద్ధాన్ని సమర్థించుకున్నారు. ఈ యుద్ధం వల్ల ఇరాన్ అణు ఆయుధం పొందకుండా అడ్డుకోగలిగామని.. పశ్చిమాసియాలో ఏ దేశాన్నీ బెదిరించే స్థాయిలో లేకుండా చేశామని చెప్పారు.
అయితే, నవంబర్ 3న జరగనున్న మధ్యంతర ఎన్నికల తర్వాత ఇరాన్‌తో ఒప్పందం కుదరవచ్చని ట్రంప్ చెప్పారు. ‘‘మిడ్ టర్మ్ ఎన్నికల్లో నా పనితీరు ఎలా ఉంటుందో చూసేందుకు వారు వేచి చూస్తున్నారు. కానీ ఈ ఎన్నికల్లో నేను పోటీ చేయట్లేదు. వీటితో నా రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం ఉండదు’’ అని చెప్పారు. వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడిని ఖండిస్తూ భారీ ఓటింగ్ నిర్వహించిన భద్రతా మండలికి కృతజ్ఞతలు తెలిపారు. ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని కొనసాగించాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు.
ఏఐ కంపెనీలను కట్టడి చేయగలం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీపై కొత్త రూల్స్ తేవడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. అవసరమైతే ఏఐ కంపెనీలను అమెరికా న్యాయ శాఖ కట్టడి చేయగలదన్నారు. ఏఐ టెక్నాలజీ అనేది పారిశ్రామిక విప్లవం కంటే చాలా పెద్దదిగా మారుతుందని, దాని అభివృద్ధిని తాను ఎట్టిపరిస్థితుల్లోనూ అడ్డుకోనన్నారు. ఇకపై అమెరికా ప్రభుత్వ పత్రాలలో ఏఐకి బదులుగా ‘సూపర్ ఇంటెలిజెన్స్’ అనే పదాన్ని ఉపయోగిస్తామని వెల్లడించారు.
కాగా, గత ఏడాది భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని ట్రంప్ మరోసారి చెప్పుకున్నారు. ‘‘అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ ఎనిమిది యుద్ధాలను ఆపడం నాకెంతో గర్వంగా ఉంది” అని అన్నారు.
ఇరాన్ ప్రతినిధుల వాకౌట్
యూఎన్ జనరల్ అసెంబ్లీ హాల్‌లో ట్రంప్ స్పీచ్ ఇస్తుండగా, ఇరాన్ ప్రతినిధులు వాకౌట్ చేశారు. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చి న్యూయార్క్‌లోనే ఉన్న ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, విదేశాంగ మంత్రి అరాఘ్చీ కూడా ట్రంప్ పాల్గొన్న సెషన్‌కు గైర్హాజరయ్యారు.
