కేంద్రంలో కాంగ్రెస్ వస్తే బీసీ డిమాండ్లు పరిష్కరిస్తాం.. కర్నాటక సీఎం శివకుమార్ హామీ

కేంద్రంలో కాంగ్రెస్ వస్తే బీసీ డిమాండ్లు పరిష్కరిస్తాం.. కర్నాటక సీఎం శివకుమార్ హామీ
  • బీసీల వాటాకోసం రాజీలేని పోరాటం: జాజుల
  • బెంగళూరులో జాతీయ బీసీ మహాసభ

హైదరాబాద్, వెలుగు: బీసీల ఉద్యమానికి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అండగా ఉంటుందని, కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీల డిమాండ్లన్నీ నెరవేరుస్తామని కర్నాటక సీఎం డీకే శివకుమార్​ హామీ ఇచ్చారు. రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్​, బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం బెంగళూరులో జరిగిన ఓబీసీ జాతీయ మహాసభకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

దేశవ్యాప్తంగా కులగణన జరిగితేనే అన్ని రంగాల్లో దామాషా ప్రకారం బీసీలకు అవకాశాలు దక్కుతాయని, రాహుల్ గాంధీ ఇదే విషయం చెప్పారని సీఎం గుర్తు చేశారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల సాధన కోసం, తమ వాటా దక్కించుకునేందుకు రాజీలేని పోరాటం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు.

మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కోసం కేంద్రంపై యుద్ధం చేస్తామన్నారు. ఈ సభలో కర్నాటక పీసీసీ చీఫ్ బీకే హరిప్రసాద్, కర్నాటక డిప్యూటీ స్పీకర్ ఉమాశ్రీ, మహారాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి అదుల్ సావే, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, ఎంపీ ఈటెల రాజేందర్, శాసనమండలి బీఆర్ఎస్​ పక్షనేత సిరికొండ మధుసూదనాచారి, వివిధ రాష్ట్రాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.