- కేంద్ర మంత్రి జువాల్ ఓరాంకు మంత్రి అడ్లూరి విజ్ఞప్తి
- గిరిజన సంక్షేమానికి రూ.70 కోట్ల అదనపు నిధులు ఇవ్వాలని వినతి
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో గిరిజన విద్యార్థుల ఉన్నత విద్యకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ.452.05 కోట్ల పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ బకాయిలను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కోరారు. అలాగే, గిరిజన సంక్షేమానికి రూ.70 కోట్ల అదనపు నిధులు ఇవ్వాలని, ప్రధాన్ మంత్రి ఆది ఆదర్శ గ్రామ యోజన (పీఎంఏఏజీవై) నిధులు కూడా రిలీజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువాల్ ఓరాంను ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డితో కలిసి మంత్రి అడ్లూరి సమావేశమయ్యారు. ఈ భేటీలో తెలంగాణ రాష్ట్ర గిరిజనుల సంక్షేమం, విద్యాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పలు అంశాలపై కేంద్ర మంత్రికి వినతి పత్రాలు సమర్పించారు. గిరిజన విద్యార్థుల ఉన్నత విద్యకు సంబంధించి 2024–25, 2025–26 బకాయిలతో పాటు 2026–27 గాను ప్రతిపాదనల మేరకు రూ.452.05 కోట్ల కేంద్ర వాటాను రిలీజ్ చేయాలని కోరారు.
కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలి...
నోట్లపై అంబేద్కర్ పొటో ముద్రించాలని కరెన్సీపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి (సీఏపీఎస్ఎస్) ఆధ్వర్యంలో జంతర్ మంతర్‌లో జరిగిన ధర్నాకు మంత్రి అడ్లూరి సంఘీభావం తెలిపారు. అనంతరం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు బీఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. సమావేశంలో ఎంపీలు మల్లు రవి, ఆర్.కృష్ణయ్య, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాశీం, సీఏపీఎస్ఎస్ జాతీయ అధ్యక్షుడు జరిపోతుల పరుశురాం తదితరులు పాల్గొన్నారు.
