సైబర్ కేటుగాళ్లపై ఉక్కుపాదం..15 రాష్ట్రాల్లో 49 మంది అరెస్ట్.. రూ. 98.89 లక్షలు రికవరీ

సైబర్ కేటుగాళ్లపై ఉక్కుపాదం..15 రాష్ట్రాల్లో 49 మంది అరెస్ట్.. రూ. 98.89 లక్షలు రికవరీ

హైదరాబాద్ సిటీ, వెలుగు: దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లపై హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. 15 రాష్ట్రాల్లో దాడులు నిర్వహించి ఏకంగా 49 మందిని అరెస్ట్​చేశారు. 38 కేసుల్లో బాధితులు పోగొట్టుకున్న రూ.13,87,18,283 లో రూ. 98,89,202 లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. 

జులై 2026 నెలకు సంబంధించి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్‌‌సీఆర్‌‌‌‌పీ) లో నమోదైన ఫిర్యాదుల ఆధారంగా సమగ్ర విచారణ చేపట్టారు. అత్యధికంగా ట్రేడింగ్ మోసాల్లో 29 మంది, సోషల్ మీడియా నేరాల్లో ఐదుగురు, డిజిటల్ అరెస్ట్ కేసుల్లో మూడు, వాట్సాప్ డీపీ ఫ్రాడ్స్​లో మూడు, మ్యాట్రిమోనియల్ మోసాల్లో రెండు, ఏపీకే ఫ్రాడ్, క్రిప్టో ట్రేడింగ్, ఇన్వెస్ట్‌‌మెంట్, ఉద్యోగ మోసాలు, పోక్సో, పాత నాణేల కొనుగోలు చీటింగ్‌‌లలో ఒక్కొక్కరిని అరెస్ట్ చేశారు.

మనోళ్లే 13 మంది.. 

సైబర్​నేరస్తుల్లో పట్టుకున్న వారిలో తెలంగాణ నుంచే 13 మంది ఉన్నారు. మహారాష్ట్రలో ఏడుగురిని, రాజస్థాన్ లో ఆరుగురిని, పశ్చిమ బెంగాల్ లో ఐదుగురిని, యూపీలో నలుగురిని, బీహార్ లో ముగ్గురిని, ఢిల్లీ, హర్యానా, జార్ఖండ్‌‌ల నుంచి ఇద్దరు చొప్పున, ఏపీ, కర్ణాటక, ఒడిశా, పంజాబ్, ఉత్తరాఖండ్‌‌ల నుంచి ఒక్కొక్కరు చొప్పున పట్టుబడ్డారు. నిందితుల నుంచి 25 డెబిట్ కార్డులు, 23 మొబైల్ ఫోన్లు, తొమ్మిది చెక్ బుక్స్, ల్యాప్‌‌టాప్‌‌లు సహా పలు కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. 

భూమి బయో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాట్సాప్‌‌ను హ్యాక్ చేసి రూ. 25 లక్షలు ఆర్‌‌‌‌టీజీఎస్‌‌ ద్వారా కాజేసిన కేసులో హర్యానా గురుగ్రామ్‌‌లో ఉంటున్న బిహార్ వాసి అభినందన్ కుమార్ కామత్ (30)ను అరెస్ట్ చేశారు. అతడి నుంచి 2 మొబైల్స్, మూడు డెబిట్ కార్డులు, నాలుగు పాస్ బుక్స్, రెండు స్టాంపులు, రెండు పాన్ కార్డులు, రెండు ఒరిజినల్ రెంటల్ అగ్రిమెంట్లను సీజ్ చేశారు. నగరంలోని జోనల్ సైబర్ సెల్స్ పరిధిలో 2,059 పిటిషన్లు రాగా 298 ఎఫ్‌‌ఐఆర్‌‌లు నమోదు చేసి మరో రూ. 27,09,320 రిఫండ్ చేయించారు.