ఆడంబరాలతోనే ఆర్థిక ఇబ్బందులు..2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తెలంగాణ

ఆడంబరాలతోనే ఆర్థిక ఇబ్బందులు..2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తెలంగాణ
  • ఎక్సైజ్​ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

షాద్‌‌నగర్/చేవెళ్ల, వెలుగు: 2047 నాటికి భారత్‌‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలంటే శాస్త్రీయ పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణలు, యువశక్తి సమన్వయంతో ముందుకు సాగాలని ఎక్సైజ్​ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం పాలమూరు యూనివర్సిటీ, కేంద్ర విద్యాశాఖ సంయుక్తంగా కన్హా శాంతివనంలో నిర్వహించిన రెండు రోజుల జాతీయ సదస్సు ‘విజన్ ఇండియా–2047, సైన్స్, ఇన్నోవేషన్ అండ్ యూత్ ఎంపవర్‌‌మెంట్’ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఏఐ, డేటా సైన్స్, బయోటెక్నాలజీ, సెమీకండక్టర్లు, పునరుత్పాదక ఇంధనం, అంతరిక్ష సాంకేతికత, స్టార్టప్‌‌లు వంటి రంగాలే భవిష్యత్ ఆర్థిక వ్యవస్థకు పునాదిగా నిలుస్తాయని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణను 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. కార్పొరేట్ విద్య, వైద్యం, ఆడంబరాలపై అధిక ఖర్చుల వల్ల అనేక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. ప్రభుత్వ విద్య, వైద్య సేవలను మరింత బలోపేతం చేయడం ద్వారానే వికసిత్ భారత్–2047, రైజింగ్ తెలంగాణ–2047 లక్ష్యాలు సాధ్యమవుతాయని స్పష్టం చేశారు. సామాజిక రుగ్మతలపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు త్వరలో ‘ప్రభాత భేరి’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.