కోటపల్లి, వెలుగు: పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణకు తెలంగాణ నేతకాని సమాజం జీవితాంతం రుణపడి ఉంటుందని చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నేత దుర్గం వెంకటస్వామి అన్నారు. శుక్రవారం కోటపల్లి మండలంలోని ఆలుగామలో నేతకాని కులస్తులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నేతకాని కులం పేరు అధికారిక రికార్డుల్లో ‘నెట్కాని’గా నమోదై ఉండటంతో ఏండ్లుగా నేతకాని కులస్తులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు.
ఈ విషయాన్ని గుర్తించిన ఎంపీ వంశీకృష్ణ ఢిల్లీలో కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ ను కలిసి వివరించారని, ‘నేతకాని’గా సవరించాలని వినతిపత్రం అందజేశారు. ఎంపీ చేసిన చొరవకు నేతకాని సంఘం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. గడ్డం వెంకటస్వామి కుటుంబం ఎల్లప్పుడూ ప్రజా సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని కొనియాడారు.
మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ నాయకత్వంలో చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగుతోందని అన్నారు. కార్యక్రమంలో కోటపల్లి మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సజన్ కుమార్, జనరల్ సెక్రటరీ దుర్గం బ్రహ్మయ్య, సెక్రటరీ పల్లె సత్తయ్య, కాంగ్రెస్నేతలు తదితరులు పాల్గొన్నారు.
