మెదక్, వెలుగు: ప్రజాకవి గద్దర్ ఆశయాలు నేటి యువతకు మార్గదర్శకమని తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్ డాక్టర్ గుమ్మడి వెన్నెల అన్నారు. గద్దర్ మూడో వర్ధంతి సందర్భంగా శుక్రవారం మెదక్ జిల్లాకేంద్రంలో ఆయన ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెన్నెల మాట్లాడుతూ.. పేద, బడుగు, బలహీన వర్గాలు, అణగారిన ప్రజల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు గద్దర్ అని కొనియాడారు. తన ఆట, పాటలతో దోపిడీ వ్యవస్థను ప్రశ్నించి ప్రజల్లో చైతన్యం నింపిన ప్రజాయుద్ధ నౌక అని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాటలు ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించాయన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం గద్దర్ చూపిన మార్గాన్ని భావితరాలు కొనసాగించాలని, యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. గద్దర్ జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని, ఆయన జన్మించిన మెదక్ జిల్లాకు గద్దర్ పేరు పెట్టడంతో పాటు హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాలల హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు మైసయ్య, కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడు గంగాధర్, బీఎస్పీ, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.
