సిద్దిపేట/ములుగు, వెలుగు: మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని 325 సర్వే నంబర్‌లో సోమవారం అధికారులు ఎంజాయ్‌మెంట్ సర్వేను ప్రారంభించారు. గత మూడు రోజులుగా 325 సర్వే నంబర్‌లోని 388.05 ఎకరాల సరిహద్దులను పరిశీలించిన అధికారులు.. నాలుగో రోజు పట్టాదారుల వారీగా వారి సమక్షంలో హద్దుల సర్వే నిర్వహించారు.
ఇందు కోసం గత శనివారం 325 సర్వే నంబర్‌లోని 100 మంది రైతులకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. సర్వే సందర్భంగా నోటీసులు అందుకున్న పట్టాదారు రైతుల పట్టా పాస్‌బుక్కులు, ఇతర యాజమాన్య పత్రాలను పరిశీలించారు.
శాటిలైట్ మ్యాపింగ్ ఆధారంగా భూ విస్తీర్ణాలతో పాటు హద్దులను కొలిచారు. సోమవారం ఉదయం 10 గంటలకు ఎంజాయ్‌మెంట్ సర్వేను ప్రారంభించిన అధికారులు సాయంత్రం 5 గంటల వరకు నోటీసులు అందుకున్న రైతులు చూపిన వివరాల ఆధారంగా తమ వద్ద ఉన్న రికార్డుల ప్రకారం భూ హద్దులను గుర్తించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఇదిలా ఉండగా.. సోమవారం 325 సర్వే నంబర్‌లోని మరో 50 మందికి నోటీసులు జారీ చేసి, నిర్ధారించిన తేదీన భూమికి సంబంధించిన హక్కు పత్రాలతో హాజరు కావాలని సూచించారు. ఎంజాయ్‌మెంట్ సర్వే మరికొద్ది రోజుల పాటు సాగే అవకాశం ఉందని, సర్వే పూర్తయిన తర్వాత నివేదికను రెవెన్యూ అధికారులకు సమర్పిస్తామని అధికారులు వెల్లడించారు.
పాత పాస్‌బుక్కులతో రైతుల హాజరు..
ఎర్రవల్లిలోని 325 సర్వే నంబర్‌లో ఎంజాయ్‌మెంట్ సర్వేకు నోటీసులు అందుకున్న రైతులు తమ వద్ద ఉన్న పాత పాస్‌బుక్కులతో అధికారుల ముందు హాజరయ్యారు. ధరణి పోర్టల్ ప్రారంభమైన తర్వాత 325 సర్వే నంబర్‌ను హోల్డ్‌లో పెట్టారని, కొత్త పాస్‌బుక్కులు ఇవ్వలేదని పలువురు రైతులు అధికారులకు విన్నవించారు. ఆన్‌లైన్‌లో భూ వివరాలు కనిపించకపోవడంతో రైతుబీమా, రైతుబంధు, రుణమాఫీ వంటి పథకాలు గత కొంతకాలంగా అందడం లేదని చెప్పారు.
వివరాల నమోదు పైనే అధికారుల దృష్టి ?
ఎంజాయ్‌మెంట్ సర్వేకు వచ్చిన అధికారులు రైతులు చూపిన వివరాలను నమోదు చేసుకున్నారే తప్ప రైతుల ఇబ్బందులను పట్టించుకోలేదని పలువురు ఆరోపించారు. కొందరు రైతులకు పట్టా పాస్‌బుక్కులో ఉన్న విధంగా మోకాపై తక్కువ భూమి ఉండటం, కబ్జాలో ఉన్న వారికి సరైన ఆధార పత్రాలు లేకపోవడం, ఆధార పత్రాలు ఉన్నా భూమి లేకపోవడం వంటి అంశాలను రైతులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. కొన్నేళ్లుగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించే ప్రయత్నం చేసినా.. అధికారులు పట్టించుకోలేదని రైతులు వాపోయారు.
రిజర్వాయర్ల నిర్వాసితులకు భూములు కేటాయించాలి..
మర్కుక్ మండలం శివారు వెంకటాపూర్ గ్రామస్తులు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసేందుకు సిద్ధమవుతున్నారు. గ్రామానికి చెందిన 118 ఎకరాల భూమిని ఎర్రవల్లి గ్రామ పరిధిలోని 325 సర్వే నంబర్‌లో విలీనం చేశారని, దీన్ని తిరిగి తమ గ్రామంలోకి మార్చాలని కోరేందుకు సిద్ధమవుతున్నారు.
ఇదిలా ఉండగా.. జిల్లాలో రిజర్వాయర్ల నిర్మాణంతో భూములు కోల్పోయిన రైతులకు ఎర్రవల్లిలోని 325 సర్వే నంబర్‌లో భూములు ఇవ్వాలని కోరుతూ సోమవారం సిద్దిపేట కలెక్టరేట్లో వినతిపత్రం సమర్పించారు. జిల్లాలోని రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, గౌరవెల్లి రిజర్వాయర్ల నిర్మాణంతో భూములు కోల్పోయినా తమకు సరైన విధంగా పరిహారం, భూమి దక్కలేదని రైతులు తెలిపారు. ఎర్రవల్లిలోని 325 సర్వే నంబర్‌లో నిర్వాసితులకు భూమిని కేటాయించాలని వినతిపత్రంలో కోరారు.
కొత్త పాస్ బుక్లు ఇంత వరకు ఇవ్వలే..
నాకు ఎర్రవల్లి 325 సర్వే నంబర్ లో ఎకరంన్నర భూమి ఉంది. గతంలో పాత పాస్ బుక్కు ల ఆధారంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేవి. ధరణి ప్రారంభం అయినప్పటి నుంచి భూమి వివరాలు ఆన్‌లైన్‌లో చూపించడం లేదు. కొత్త పాస్ బుక్కులు ఇప్పటికీ ఇవ్వలేదు.
సలేంద్ర రేణుక, రైతు, ఎర్రవల్లి
