- నేతన్న బీమా, నేతన్నకు చేయూత పథకాలను పునరుద్ధరించాలని విజ్ఞప్తి
- చేనేత రంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షోభంలోకి నెడుతున్నాయని విమర్శ
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సంస్కృతి, అస్తిత్వానికి వెన్నెముకగా నిలిచిన చేనేత కార్మికుల పరిస్థితి కాంగ్రెస్ పాలనలో దిగజారిపోయిందని బీఆర్ఎస్వర్కింగ్ప్రెసిడెంట్ కేటీఆర్ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో అమలు చేసిన నేతన్న బీమా, నేతన్నకు చేయూత వంటి అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపేసి చేనేతను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టిందని విమర్శించారు.
ఎన్నికల ముందు చేనేత కార్మికులకు కాంగ్రెస్‌ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు కాలేదన్నారు. వెంటనే అన్ని పథకాలను పునరుద్ధరించి నేతన్నలకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం చేనేత కార్మిక దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు.
చేనేత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే విధానాలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రెండూ కలిసి చేనేత రంగాన్ని సంక్షోభం వైపు నెడుతున్నాయని మండిపడ్డారు.
మేం చేనేతకు అగ్రపీఠం వేశాం
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దేశంలో ఎక్కడా లేని విధంగా చేనేత రంగానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని కేటీఆర్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 55,072 మంది చేనేత కార్మికులకు రూ.5 లక్షల జీవిత బీమా కల్పిస్తూ నేతన్న బీమా అమలు చేశామన్నారు. నేతన్నకు చేయూత పథకం ద్వారా కార్మికుల పొదుపును ప్రోత్సహిస్తూ, కార్మికుడు ప్రతినెల రూ.1,200, అనుబంధ కార్మికుడు రూ.800 చెల్లిస్తే ప్రభుత్వం రూ.4,000 వరకు వాటా జమ చేసే వినూత్న విధానాన్ని అమలు చేశామని వివరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడం లేదన్నారు. చేనేత సహకార సంఘాలకు ఇవ్వాల్సిన పావలా వడ్డీ రుణాలు, మార్కెటింగ్ రిబేట్లు నిలిచిపోయాయని, బతుకమ్మ చీరలు, ప్రభుత్వ యూనిఫారాల తయారీలో నేతన్నలకు ప్రాధాన్యం తగ్గించారని మండిపడ్డారు. ప్రభుత్వ ఆర్డర్లన్నీ కమీషన్ల కోసం ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్తున్నారని పేర్కొన్నారు.
హామీలు ఏమైనయ్
నేతన్నల కోసం గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయని కేటీఆర్ ప్రశ్నించారు. అడ్డగోలుగా హామీలిచ్చి అందరినీ మోసం చేసినట్టుగానే నేతన్నలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నదన్నారు. చేనేత భరోసా కింద ప్రతి ఏడాది రూ.18 వేల ఆర్థిక సాయం, అనుబంధ కార్మికులకు రూ.6 వేల సహాయం, లక్ష రూపాయల వరకు వ్యక్తిగత రుణమాఫీ, చేనేత సహకార సంఘాల క్యాష్ క్రెడిట్ రుణాల మాఫీ, కేంద్రం విధిస్తున్న 5 శాతం జీఎస్టీ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందన్న హామీల్లో ఒక్కటీ అమలు కాలేదని విమర్శించారు.
రెండున్నరేళ్లు గడిచినా నేతన్నలకు ఇచ్చిన హామీలు కాగితాలకే పరిమితమయ్యాయని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా చేనేత రంగానికి తీవ్ర అన్యాయం చేసిందన్నారు. ఆలిండియా హ్యాండ్లూమ్ బోర్డు, హ్యాండీక్రాఫ్ట్స్ బోర్డు, పవర్‌లూమ్ బోర్డులను రద్దు చేయడం, హౌస్ కమ్ వర్క్‌షెడ్ వంటి పథకాలను ఎత్తివేయడం, చేనేత ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీ విధించడం వంటి నిర్ణయాలు చేనేత రంగాన్ని తీవ్రంగా దెబ్బతీశాయని కేటీఆర్ పేర్కొన్నారు.
