హైదరాబాద్, వెలుగు: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి విచారణకు సహకరించలేదని అత్తాపూర్ పోలీసులు ఉప్పరపల్లి కోర్టుకు తెలిపారు. ఉదయ్ కృష్ణారెడ్డి నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు అతన్ని మరో మూడు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. కోర్టు అనుమతితో గురువారం ఉదయం ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
శుక్రవారం కస్టడీ ముగియడంతో ఆయనను ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. నిందితుడు విచారణకు సహకరించలేదని తెలిపారు. కాగా విచారణ సమయంలో పోలీసులు తన పట్ల అనుచింతంగా వ్యవహరించారని ఉదయ్‌కృష్ణారెడ్డి మేజిస్ట్రేట్‌కు తెలిపాడు. సీసీ కెమెరాలు లేని చోట తనను విచారిస్తూ.. ఓ దశలో పలువురు అధికారులు అనుచితంగా ప్రవర్తించారని కోర్టుకు వెల్లడించాడు. దాంతో నిందితుడి ఆరోపణలపై రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ అత్తాపూర్ ఇన్‌స్పెక్టర్‌కు కోర్టు మెమో జారీ చేసింది.
