- మహిళపై అత్యాచారం..నలుగురు రిమాండ్
మల్యాల, వెలుగు: మహిళను వీడియో తీసి బ్లాక్‌మెయిల్ చేసి అత్యాచారానికి పాల్పడిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి గ్రామ శివారులోని డబుల్ బెడ్రూమ్ కాలనీలో జరిగింది. సీఐ రాజ్‌కుమార్, ఎస్సై సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లాకు చెందిన 34 ఏళ్ల మహిళ ఈ నెల 3న ఓ ఇంట్లో తన సన్నిహితుడితో ఉండగా రాజారం గ్రామానికి చెందిన శివరాత్రి నరేశ్, గుర్రం శ్రీకాంత్, అంజయ్య, మల్లేశం కారులో అక్కడికి వెళ్లారు. నరేశ్, శ్రీకాంత్ గదిలోకి ప్రవేశించగా.. అంజయ్య, మల్లేశం బయట ఉన్నారు. లోపలికి వెళ్లిన ఇద్దరు సదరు మహిళ మరో వ్యక్తితో ఉన్న వ్యక్తి వీడియో తీశారు. అనంతరం ఆ వ్యక్తిని బయటకు పంపించి మహిళను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత ఆ వీడియోను మహిళకు పంపి బ్లాక్‌మెయిల్ చేస్తూ, మళ్లీ తమతో రావాలని బెదిరించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు గురువారం సాయంత్రం నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి శుక్రవారం వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. నిందితులు నరేశ్, శ్రీకాంత్‌పై రౌడీషీట్లు ఉన్నాయని, మరో ఇద్దరిపైనా పాత కేసులు ఉన్నట్లు సీఐ తెలిపారు. నిందితులు ఉపయోగించిన ఇన్నోవా కారు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
