- ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ ఆమోదిస్తున్నరు
- పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఎంపీ వంశీకృష్ణ ఫైర్
న్యూఢిల్లీ, వెలుగు: దేశంలోని యువతను నియంత్రించేలా మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పన్నులు, ఇతర చట్టాల(సవరణ) బిల్లును తెచ్చిందని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ విమర్శించారు. ప్రతిపక్షాల గొంతునొక్కుతూ ఆ బిల్లుకు ఆమోదం తెలిపిందని ఫైర్అయ్యారు. శుక్రవారం పార్లమెంట్ ఆవరణలో మీడియాతో ఆయన మాట్లాడారు.
దేశ యువత చేసిన కేవలం ఒకే ఒక్క ఆందోళనతో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా భయపడ్డారన్నారు. నిరసన తెలిపిన
వారిని ఫేస్ రికగ్నేషన్ కెమెరాలతో గుర్తించి అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇంతలా దేశ యువతను ఎందుకు అణచివేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ‘నిర్మలా సీతారామన్ పన్నులు, ఇతర చట్టాల(సవరణ) బిల్లును ప్రవేశపెట్టారు. దీని ద్వారా యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) విధించబోతున్నారు. యూపీఐని అత్యధికంగా ఉపయోగించేది ఎవరు? మన దేశంలోని జెన్ జీ తరమే.
ఇది మన దేశంలోని జెన్ జీ తరం ప్రయోజనాలకు విరుద్ధం కాదా? ఇకపై ఆందోళనలో పాల్గొనే యువకులను గుర్తించి, పోలీసులు నేరుగా బ్యాంకులను సంప్రదిస్తారు. ఆ వ్యక్తికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎలా ఖర్చు పెడుతున్నాడు? ఇలా పూర్తి ఆర్థిక లావాదేవీలను తెలుసుకునేందుకే ఈ సవరణను ప్రవేశపెట్టారు. బ్యాంకు కేవలం మూడు రోజుల్లోగా పోలీసుల కోరిన సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే, అది చట్ట ఉల్లంఘనగా పరిగణిస్తారు. ప్రతిపక్షాల గొంతు వినకుండా ఇలాంటి చట్టాలను ప్రవేశపెట్టి, ప్రజల గొంతు వినకుండా వీటిని ఆమోదిస్తున్నారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికం. మేము దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్నం. మన దేశ యువతను నియంత్రించే ఇలాంటి చట్టాలను ఎందుకు ఆమోదిస్తున్నారు?’ అని ఎంపీ ప్రశ్నించారు.
