- ఓయూ అభివృద్ధికి రూ.వెయ్యి కోట్ల హామీ ఏమైందని క్వశ్చన్
హైదరాబాద్, వెలుగు: హుస్సేన్ సాగర్‌లో వినాయక నిమజ్జనానికి యథావిధిగా అనుమతివ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా హుస్సేన్ సాగర్‌ను 'వినాయక సాగర్'గా భావించి నిమజ్జనాలు చేస్తున్నామని, ఈసారి బ్యాక్ వాటర్స్ వైపు మళ్లించే ప్రయత్నాలను తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. సోమవారం ఓయూలో గణేశ్ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం మాట్లాడుతూ.. ఖైరతాబాద్ మహాగణపతితోపాటు లక్షలాది విగ్రహాలు నిమజ్జనానికి వస్తాయని, పటిష్టమైన చర్యలతో పర్యావరణానికి హాని లేకుండా నిమజ్జనం నిర్వహించవచ్చని తెలిపారు. భాగ్యనగర్ గణేశ్ఉత్సవ సమితి డిమాండ్లకు బీజేపీ పూర్తి మద్దతు ఇస్తుందని, యుద్ధ ప్రాతిపదికన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఓయూలో విద్యార్థులు ఎదుర్కొంటున్న హాస్టల్ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఓయూలోని ఈ- హాస్టల్ విద్యార్థులను ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా బలవంతంగా సీ హాస్టల్‌కు తరలించడం సరికాదన్నారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓయూ అభివృద్ధికి రూ.వెయ్యి కోట్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారనీ, ఆ నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. శిథిలావస్థలో ఉన్న హాస్టళ్లను బాగు చేయాలని డిమాండ్ చేశారు.
