- శ్రీలంక ఎలెవన్ తొలి ఇన్నింగ్స్‌లో 363/8..
కొలంబో: శ్రీలంక ఎలెవన్‌తో శుక్రవారం ప్రారంభమైన మూడు రోజుల వామప్ మ్యాచ్‌లో ఇండియా ప్రధాన బౌలర్లు ఫెయిలయ్యారు. లంక యంగ్ బ్యాటర్లను కట్టడి చేయలేక భారీ స్కోరు సమర్పించుకున్నారు. దాంతో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లంక తొలి రోజు ఆట ముగిసే టైమ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 363/8 స్కోరు చేసింది.
రవీందు రసంత (71), నిషాన్ ఫెర్నాండో (66), కెప్టెన్ సోనాల్ దినుషా (52) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. ఈ మ్యాచ్‌కు ఫస్ట్ క్లాస్ హోదా లేదు కాబట్టి నిబంధనల ప్రకారం తొలి రెండు రోజుల్లో ప్రతి జట్టు 90 ఓవర్లు, చివరి రోజున చెరో 45 ఓవర్ల చొప్పున బ్యాటింగ్ చేస్తాయి.
బ్యాటర్లదే హవా..
నాన్‌డిస్క్రిప్ట్స్ క్రికెట్ క్లబ్ పిచ్‌పై ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లంక కుర్రాళ్లు.. ఇండియా బౌలింగ్‌ను అలవోకగా ఎదుర్కొన్నారు. ఐదు వారాల విరామం తర్వాత రెడ్‌బాల్ మ్యాచ్ ఆడుతుండటంతో ఇండియా పేసర్లు ఆరంభంలో బాగా తడబడ్డారు. అయితే స్పిన్నర్లు ఎక్కువ వికెట్లు తీసినా రన్స్‌ను కట్టడి చేయలేకపోయారు. చివర్లో కుల్దీప్ యాదవ్ (2/76) బంతిని బాగా టర్న్ చేసి లంక బ్యాటర్లను ఇబ్బందిపెట్టాడు. తొలి సెషన్‌లో ఓపెనర్లు నిషాన్.. పేసర్ సిరాజ్ (0/44), ప్రసిధ్ కృష్ణ (0/32) బౌలింగ్‌ను చాలా ఈజీగా ఆడాడు. గుర్నూర్ బ్రార్ (1/49) కొద్దిగా రన్స్ కట్టడి చేయగలిగాడు.
తొలి వికెట్‌కు 20.4 ఓవర్లలోనే 110 రన్స్ జోడించి నిషాన్ ఫెర్నాండో అనూహ్యంగా రనౌటయ్యాడు. ఓ ఎండ్‌లో నిలకడగా ఆడిన రవింద్.. పసిందు సూరియబండార (35)తో రెండో వికెట్‌కు 61, పవన్ రత్నాయకే (39)తో మూడో వికెట్‌కు 30 రన్స్ జత చేసి ఔటయ్యాడు. మిడిలార్డర్‌లో అహాన్ విక్రమసింగే (31) మోస్తరుగా ఆడినా... కెప్టెన్ దినుషా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. కుల్దీప్ బౌలింగ్‌లో కొట్టిన స్ట్రయిట్ సిక్సర్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. తొలి స్పెల్ ఐదు ఓవర్లలో 29 రన్స్ ఇచ్చిన కుల్దీప్ రెండో స్పెల్‌లో బాల్ వేగాన్ని నియంత్రించి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు.
బ్యాటర్ స్వీప్ చేయడానికి ప్రయత్నించినప్పుడు కొద్దిగా గాల్లోకి లేచిన బాల్‌తో విక్రమసింగేను ఔట్ చేశాడు. తర్వాత ఆర్మ్‌బాల్‌తో అంజలా బండార (13)ను బోల్తా కొట్టించాడు. దాంతో లంక స్కోరు 284/6గా మారింది. ఈ దశలో వచ్చిన రమేశ్ మెండిస్ (32), దినుషాకు మంచి సహకారం అందించాడు. ఏడో వికెట్‌కు 64 రన్స్ జత చేసి జడేజా (2/64)కు వికెట్ ఇచ్చాడు. మానవ్ సుతార్ 2 వికెట్లు పడగొట్టాడు.
గిల్ దూరం..
ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తొలి రోజు ఆటకు దూరంగా ఉన్నాడు. కుడి చేతి వేలికి గాయం కావడంతో అతను బరిలోకి దిగలేదు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మ్యాచ్‌కు దూరంగా ఉండాలని బీసీసీఐ వైద్య బృందం సూచించింది. దాంతో గిల్ ప్లేస్లో కేఎల్ రాహుల్ జట్టును నడిపించాడు.
