కాచిగూడ, వెలుగు: కాచిగూడ కమేళాలో హెచ్-ఫాస్ట్ అధికారులు శుక్రవారం నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో 60 కిలోల కుళ్లిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఐస్ బాక్సుల్లో కుళ్లిన మాంసాన్ని నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు సికింద్రాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ మహేశ్, కానిస్టేబుల్ వినయ్‌తో కలిసి అధికారులు దాడులు నిర్వహించారు. తనిఖీల్లో విక్రయానికి సిద్ధంగా ఉంచిన 60 కిలోల కుళ్లిన మాంసాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
దాన్ని ఎవరూ వినియోగించకుండా ఫినాయిల్ చల్లి నిర్వీర్యం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కుళ్లిన మాంసాన్ని నిల్వ ఉంచిన యజమాని అఖిల్‌పై కేసు నమోదు చేసి, చలాన్ విధించినట్లు అధికారులు తెలిపారు. ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగించే ఆహార పదార్థాల విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
