- గ్రూపులు పక్కన పెట్టి.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడాలని పిలుపు
- ఢిల్లీలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం.. రాష్ట్ర ఇన్‌చార్జ్ పాటిల్, స్టేట్ చీఫ్ రాంచందర్ రావు, ఎంపీలు హాజరు
న్యూఢిల్లీ, వెలుగు: విభేదాలు పక్కన పెట్టి సమిష్టిగా ముందుకు సాగాలని.. అప్పుడే తెలంగాణలో అధికారంలోకి రావడానికి మార్గం సుగుమం అవుతుందని బీజేపీ రాష్ట్ర నేతలకు పార్టీ చీఫ్ నితిన్ నబీన్ దిశా నిర్దేశం చేశారు. ఇకపై గ్రూపు రాజకీయాలకు ఆస్కారం లేకుండా.. తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడాలని ఆదేశించారు.
ఎంతటి వారైనా పార్టీ లైన్ లోనే వెళ్లాలని, వ్యక్తిగత మైలేజ్, ఇతర నేతలను టార్గెట్ చేస్తూ తెరవెనక రాజకీయాలకు పాల్పడొద్దని క్లియర్ ఇండికేషన్స్ ఇచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. శుక్రవారం ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ అధ్యక్షతన.. పార్టీ ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో రాష్ట్ర ఇన్‌చార్జ్ అభయ్ పాటిల్, అధ్యక్షుడు రాంచందర్ రావు, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, పార్టీ లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు పాల్గొన్నారు.
ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్రంలో పార్టీ సంస్థాగత బలోపేతం, రాబోయే ఎన్నికలు, నేతల మధ్య సఖ్యత, ప్రభుత్వ వైఫల్యాలపై పార్టీ భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. తొలుత నితిన్ నబిన్.. తెలంగాణలో పార్టీ చేపట్టే కార్యక్రమాల్లో ఆలస్యం, సమర్థవంతంగా నిర్వహించకపోవడం, ఇందుకు గల కారణాలు, నేతల మధ్య విభేధాలు, ఇతర అంశాలపై ఆరా తీసినట్టు తెలిసింది.
అయితే, సర్ ప్రక్రియ నేపథ్యంలో పలు కార్యక్రమాలను వేగవంతం చేయలేకపోయినట్టు రాష్ట్ర నేతలు చెప్పినట్టు సమాచారం. ప్రధానంగా గ్రామ స్థాయిలో ఈ గ్యాప్ ఉందని.. సర్ ప్రక్రియ ముగియగానే క్షేత్ర స్థాయిలో పార్టీ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. అయితే, పార్టీ బలోపేతం పై ఫోకస్ పెడుతూనే... కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి విసృతంగా తీసుకెళ్లాలని అధిష్టానం స్పష్టం చేసింది.
ఇదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఎప్పటికప్పుడు ప్రత్యేక టార్గెట్ పెట్టుకొని కార్యక్రమాలు చేపట్టాలని నిర్దేశించింది. అవసరమైతే బస్సు, కారు, పాదయాత్రలకు ప్లాన్ చేయాలని, తద్వారా ప్రజల్లో ఉండాలని తేల్చి చెప్పింది. పార్టీ చీఫ్ నబిన్ తో పాటు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు తెలంగాణలో దశల వారీగా పర్యటనలకు వస్తారని స్పష్ట చేసింది.
భిన్నాభిప్రాయాలు ఉన్నా.. విభేధాలు లేవు: పార్టీ రాష్ట్ర చీఫ్ రాంచందర్ రావు
పార్టీలో నేతల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నా.. విభేదాలు లేవని పార్టీ స్టేట్చీఫ్ రాంచందర్ రావు అన్నారు. వాటిని కూర్చొని చర్చించుకుని పరిష్కరించుకుంటామన్నారు.రాష్ట్రంలో బీజేపీ అధికారం కైవసం చేసుకోవాలని, అందుకు రోడ్ మ్యాప్ రెడీ చేసుకోవాలని పార్టీ చీఫ్ దిశా నిర్దేశం చేశారని చెప్పాన్నారు. మీటింగ్ అనంతరం రాంచందర్ రావు మీడియాతో మాట్లాడారు. బీజేపీ హైకమాండ్ టార్గెట్ లో తెలంగాణ రాష్ట్రం ఉందన్నారు. జాతీయ అధ్యక్షుడి రెగ్యులర్ రాష్ట్ర పర్యటనలు ఉంటాయన్నారు.
పలు పార్టీల నుంచి నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, సరైన సమయంలో వారంతా పార్టీలోకి వస్తారన్నారు. డీలిమిటేషన్ తర్వాత స్థానాలు పెరిగినప్పటికీ, బీజేపీ తెలంగాణలో మెజారిటీ సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే, గ్రాడ్యుయేట్ ఎన్నికలపై ఉన్నత స్థాయి సమావేశంలో చర్చించామని రాంచందర్ రావు వెల్లడించారు.
వరంగల్ -ఖమ్మం --నల్గొండ, హైదరాబాద్- రంగారెడ్డి -మహబూబ్ నగర్ పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) నియోజకవర్గాల స్థానాలను కైవసం చేసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు ఉండదని, ఒంటరిగానే బరిలో దిగుతామని క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.
డబుల్ ఇంజన్ సర్కార్ వైపు అడుగులు: బండి సంజయ్
తెలంగాణలో కార్యకర్తల సమిష్టి కృషితో బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం దిశగా స్థిరంగా అడుగులు వేస్తోందనే నమ్మకం ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ట్వీట్ చేశారు. పార్టీ చీఫ్ తో భేటీ అనంతరం సోషల్ మీడియా వేదికగా ఈ అంశాలను పంచుకున్నారు. ప్రధాన మంత్రి మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ మార్గదర్శకత్వంలో తెలంగాణలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు
