న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తోన్న మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, లోక్ సభ అపొజిషన్ లీడర్ రాహుల్ గాంధీ మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం నడిచింది. మహిళా భావప్రకటన స్వేచ్ఛ గురించి మాట్లాడే కాంగ్రెస్.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కిరణ్ రిజిజు సవాల్ విసిరారు.
దీనికి స్పందించిన రాహుల్ గాంధీ.. 2023లోనే మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందని కౌంటర్ ఇచ్చారు. 2023లోనే ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయకుండా దానిని డీలిమిటేషన్ తో ఎందుకు లింక్ పెడుతున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. డీలిమిటేషన్ తో ముడి పెట్టకుండా 2023 మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అసలేం జరిగిందంటే..?
మహిళల భావ ప్రకటనా స్వేచ్ఛ గురించి రాహుల్ గాంధీ మాట్లాడుతున్న ఒక వీడియోపై ఎక్స్ (ట్విట్టర్)లో రియాక్ట్ అయిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలని కోరారు. ‘‘ఇది కాంగ్రెస్ నుండి ఒక సానుకూల సందేశంగా కనిపిస్తోంది. మహిళల విషయంలో రాహుల్ గాంధీ మనసు మారినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు షరతులు లేకుండా మద్దతు ఇవ్వాలి’’ అని రిజిజు పేర్కొన్నారు.
దీనిపై స్పందించిన రాహుల్ గాంధీ ధీటుగా కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పూర్తి మద్దతుతో 2023లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటికే ఏకగ్రీవంగా ఆమోదం పొందిందని గుర్తు చేశారు. మూడేళ్లు గడిచినా దీన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ఎందుకు ఆ చట్టాన్ని అమలు చేయడం లేదని ప్రశ్నించారు. అంతేకాకుండా మహిళా రిజర్వేషన్‌ను డీలిమిటేషన్ బిల్లుకు ఎందుకు ముడి పెడుతున్నారని మోడీ సర్కార్‌ను స్ట్రైయిట్‌గా క్వశ్చన్ చేశారు. 2023 మహిళా రిజర్వేషన్ చట్టాన్ని ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయాలని రాహుల్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
