- తయారీ వ్యయం పెరిగిందంటూ డిస్టలరీలు చేసిన విజ్ఞప్తితో నిర్ణయం
- ఎక్సైజ్ డ్యూటీ పెంపుపైనా ప్రభుత్వం యోచన
- త్వరలోనే సీఎం ముందు నివేదిక.. ఆమోదం తరువాత అమల్లోకి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో త్వరలో మద్యం ధరలు పెరగనున్నాయి. మద్యం తయారీ వ్యయం గణనీయంగా పెరిగిపోయినందున తమకు చెల్లించే బేసిక్ ప్రైస్‌ను సవరించాలని మద్యం తయారీ సంస్థలు (డిస్టలరీలు) ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో ఈ దిశగా కీలక అడుగు పడింది. డిస్టలరీల విజ్ఞప్తిని పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి ‘ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ’ ..మద్యం ధరలను సుమారు 8 నుంచి 10 శాతం వరకు పెంచవచ్చని రికమండ్ చేస్తూ నివేదిక సిద్ధం చేసినట్లు తెలిసింది. కేవలం డిస్టలరీల డిమాండ్ మాత్రమే కాకుండా, రాష్ట్ర ఆదాయాన్ని కూడా మరింత పెంచుకునే దిశగా అదనపు ఎక్సైజ్ డ్యూటీ ని కూడా పెంచేందుకు అబ్కారీ శాఖ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ రెండు అంశాలతో కూడిన సమగ్ర ప్రతిపాదనల నివేదికను ఎక్సైజ్ శాఖ త్వరలోనే సీఎంకు సమర్పించనుంది. దీనిపై ఆమోదముద్ర వేస్తే రాష్ట్రంలో మద్యం ప్రియులపై మరింత భారం పడటం ఖాయంగా కనిపిస్తోంది.
డిస్టలరీల మొర.. కమిటీ గ్రీన్ సిగ్నల్
కొంతకాలంగా కరెంట్ ఛార్జీలు, రవాణా చార్జీలు, గ్లాస్ బాటిళ్లు, కార్టన్ బాక్సుల ధరలతో పాటు మద్యం తయారీకి ఉపయోగించే ముడిసరుకుల (రెక్టిఫైడ్ స్పిరిట్, ధాన్యాలు) వ్యయం భారీగా పెరిగినందున తమకు మార్జిన్లు తగ్గుతున్నట్లు డిస్టలరీల నిర్వాహకులు ఎక్సైజ్ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. కూలీల వేతనాలు కూడా పెరిగిన నేపథ్యంలో పాత ధరలకే డిపోలకు మద్యాన్ని సరఫరా చేయడం సాధ్యపడటం లేదని, ప్రభుత్వం స్పందించి బేసిక్ ప్రైస్‌ను పెంచాలని కోరారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం ప్రైస్ ఫిక్సేషన్ కమిటీని నియమించింది. ఈ కమిటీ డిస్టలరీల ప్రతిపాదనలు, మార్కెట్‌లోని ముడిసరుకుల ధరల గణాంకాలను పరిశీలించింది.
చివరకు మద్యం కేటగిరీని బట్టి (సాధారణ ఐఎంఎఫ్‌ఎల్ బ్రాండ్లు, ప్రీమియం బ్రాండ్లు, బీర్లు) 8 నుంచి 10 శాతం వరకు ధర సవరణ సమంజసమేనని కమిటీ అభిప్రాయపడింది. ఎక్సైజ్ డ్యూటీని కూడా పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న పన్నుల విధానాన్ని పరిశీలిస్తున్న ఉన్నతాధికారులు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఎక్సైజ్ సుంకాలను పోలుస్తున్నారు. పెరిగే తయారీ వ్యయానికి అనుగుణంగా ఎక్సైజ్ సుంకాన్ని సవరిస్తే లభించే అదనపు రాబడిని లెక్కగడుతున్నారు.
ధరలు పెరుగుతాయి ఇలా..
రాష్ట్రంలో మద్యం ధరలను నిర్ణయించే ప్రక్రియ సంక్లిష్టమైన పన్నుల నిర్మాణంతో ముడిపడి ఉంటుంది. తయారీదారుడి (డిస్టలరీ) బేసిక్ ప్రైస్‌కు ఎక్సైజ్ డ్యూటీ, స్పెషల్ ఎక్సైజ్ సెస్, వ్యాట్ , టీఎస్‌బీసీఎల్ మార్జిన్ , రిటైల్ వ్యాపారుల లాభ మార్జిన్‌ను వరుసగా జోడించి ఎంఆర్‌పీని ఖరారు చేస్తారు. చివరిసారిగా 2022 మే నెలలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో మద్యం ధరలను భారీగా పెంచిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సాధారణ విస్కీ, బ్రాందీ బ్రాండ్లపై క్వార్టర్‌కు రూ.20 నుంచి రూ.40 వరకు, ప్రీమియం బ్రాండ్లపై రూ.80 వరకు, బీర్లపై బాటిల్‌కు రూ.10 నుంచి రూ.20 వరకు పెంచారు.
ఎక్సైజ్ డ్యూటీని మాత్రం 2020 మే నెలలో కరోనా లాక్‌డౌన్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చివరిసారిగా దాదాపు 20% నుంచి 25% వరకు అదనంగా పెంచింది.ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మరోసారి పన్నుల శ్లాబులను మార్చేందుకు అధికారులు ముసాయిదా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి అబ్కారీ శాఖ అధికారులు రెండు వేర్వేరు నివేదికల రూపంలో ప్రణాళికను సిద్ధం చేసినట్లు సమాచారం.
అందులో మొదటిది ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ అందించిన 8- శాతం నుంచి10% ధరల పెంపు నివేదిక కాగా, రెండవది అదనపు ఎక్సైజ్ డ్యూటీ ద్వారా ప్రభుత్వానికి చేకూరే లబ్ధిపై రూపొందించిన ఆర్థిక అంచనాల నివేదిక. ఈ రెండు నివేదికలను త్వరలోనే మాన్యువల్ ప్రతిపాదనా పత్రంగా సీఎం వద్దకు తీసుకెళ్లనున్నారు. ఒకవేళ సీఎం నుంచి ఆమోదం లభిస్తే వెంటనే ధరల పెంపుపై అబ్కారీ శాఖ అధికారిక జీవో విడుదల చేయనుంది.
