వెలుగు ఓపెన్ పేజీ.. పాలకులూ పదిలం... కొత్తగాలి వీస్తోంది!

వెలుగు ఓపెన్ పేజీ.. పాలకులూ పదిలం... కొత్తగాలి వీస్తోంది!

‘పుడమి తల్లికి పురిటి నొప్పులు స్ఫురిపించాయి’ అని మహాప్రస్థాన కావ్యంలో శ్రీశ్రీ అన్నట్టు భారత రాజకీయాల్లో పెనుమార్పులకు సంకేతాలు కనిపిస్తున్నాయా?  ఇటీవలి పలు తాజా పరిణామాలు ఇదే భావన కలిగిస్తున్నాయి. కొత్త  ఆలోచనలు మొగ్గ తొడుగుతున్నాయి.  సరికొత్త స్వరాలు గొంతు పెగులుతున్నాయి. కొంగొత్త ఆశలు ఊపిరిగొంటున్నాయి. ఏమో!  ఏమౌతుందో?  చూడాలి.  పాలన, రాజకీయాలు, న్యాయవ్యవస్థ, మీడియా.. ఇలా అంతటా మార్పు రావాలనే  ఆకాంక్ష  సర్వత్రా పెల్లుబుకుతోంది.  ప్రజాస్వామ్యపు వ్యవస్థలన్నిటా బాధ్యత,  జ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాబుదారీతనం పెరగాలనే డిమాండ్  బలమూనుతోంది.  

రాగల రోజుల్లో ప్రజలు, వారి తక్షణ అవసరాల, సమస్యల కేంద్రకంగా నిరసనలు, ఆందోళనలు, ఉద్యమాలు  బలపడే  సూచనలు కనిపిస్తున్నాయి.  సదరు పరిణామాల పర్యవసానంగా  కొత్త  రాజకీయ వాతావరణం ఏర్పడుతుందా?  సరికొత్త  సమీకరణం రూపుదిద్దుకుంటుందా? ప్రజాస్వామ్యం బలపడుతుందా?  ప్రజలు బాగుపడుతారా?  ఇప్పటికి ఇవన్నీ కేవలం ప్రశ్నలు మాత్రమే.  ఇవాళ,  నిన్నా,  మొన్నటి  తాజా  పరిణామాలు  దేశంలో  కొత్త రాజకీయాలను ఆవిష్కరిస్తే,  ఈ  ప్రశ్నలకు సమాధానాలు లభించవచ్చు. ఆశావహులంతా  వేచి చూడాల్సిందే!

దేశంలో రాజకీయ వాతావరణం వేగంగా మారుతోంది.  వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చి ప్రస్తుతం పాలన సాగిస్తున్న ఎన్డీయే ప్రభుత్వానికి  అంతా  సానుకూలంగా ఏమీలేదు.  మున్ముందూ అంత సాఫీగా ఏమీ ఉండదు. అనుకున్నది  అనుకున్నట్టు సాధించుకునే  వాతావరణం క్రమంగా సన్నగిల్లుతోంది.  ప్రశ్నించేవాళ్లు పెరుగుతున్నారు. సర్కారు ప్రతి యోచన, విధానం,  ఆచరణపై  ప్రజా తనిఖీ పెరుగుతోంది.  రాజకీయంగా ప్రత్యర్థి పార్టీలను చీలుస్తూ,  మొత్తంగా  ప్రతిపక్షాన్ని  ఒకవైపు  బలహీనపరుస్తుంటే  ఇంకోవైపు ప్రభుత్వ వ్యతిరేకత  జనక్షేత్రంలో బలపడుతోంది.  ధిక్కార స్వరాలు పెరుగుతున్నాయి.  అంశాలవారీగా  సర్కారును బోనులో  నిలిపి,  ప్రజల దృష్టిలో దోషిగా నిలిపే ప్రయత్నాలు అధికమవుతున్నాయి.  కాక్రోచ్  ఆందోళన, జంతర్ మంతర్ నిరసనలు,  జెన్-జీ ఉద్యమం దరిమిలా ఉత్పన్నమైన  పరిస్థితులు,  మూడు రాష్ట్రాల్లోని ఉప ఎన్నికల్లో  పాలకపక్షానికి ఎదురుదెబ్బ... ఇవన్నీ ఇందుకు  ఉదాహరణలు మాత్రమే!

ఇంటా బయటా ఒత్తిడి

‘నిరసనలు దేశ ద్రోహం కాదు’ అన్నారు పాలక బీజేపీ మాతృసంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్, సర్  సంచాలక్ మోహన్ భాగవత్.  ప్రసంగాలు చేయడం, ఎన్నికలు గెలవడం, ప్రభుత్వాలు నడపటం మాత్రమే రాజకీయాలు కాదని,  ఇంకా అదనంగా ఉంటుందని ఆయనన్నారు.  ఇదివరకటి తరంకన్నా జెన్-జీ,  జెన్-ఆల్ఫా తరం  అధిక నిజాయతీపరులు, తార్కికత ఉన్నవారని కితాబిచ్చారు.  ‘మేం రాజకీయ పార్టీగా మారం.  దేశమంతా పర్యటించి, ‘ప్రజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లేమంటున్నారు’ (క్యా బోల్తీ పబ్లిక్) తెలుసుకుంటూ ఆమేరకు ఉద్యమిస్తామని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రకటించింది.  జెన్-జీ తరానికి  ప్రత్యక్షంగా  ప్రాతినిధ్యం వహిస్తున్న  సీజేపీ,  ‘ప్రెషర్ గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’గా  పనిచేస్తామని రెండు రోజుల  జాతీయ భేటీ తర్వాత విధాన ప్రకటన చేసింది.  యువత ఆకాంక్షలు,  విద్యలో సంస్కరణలు,  సగటు ప్రజల అవసరాలు, వ్యవస్థల  జవాబుదారీతనం లక్ష్యంగా  పనిచేస్తామని  చెప్పుకున్నారు. 

65 శాతం దేశ జనాభాగా ఉన్న 35 యేళ్లలోపు వారి ఆశలు,  ఆకాంక్షలు  నెరవేరడమే కాకుండా  దేశ ప్రగతి,  అభ్యున్నతిలో వారు భాగస్వామ్యం కావాలనేది  తమ డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చెప్పారు.  ఇలాంటి  ఒత్తిడి కేంద్ర ప్రభుత్వంపై  ఇంటా,  బయట పెరుగుతోంది.

జెన్-జీ తరంపై జనంలోనూ విశ్వాసం

స్వల్పకాలంలో పెద్ద,  ప్రభావవంతమైన ఉద్యమాన్ని నిర్మించిన జెన్- జీ తరంపై  జనంలోనూ విశ్వాసం, ఆశలు పెరుగుతున్నాయి.  జంతర్ మంతర్  వేదికగా మొదలెట్టి ‘చలో  సంసద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’గా  ఆందోళనను  బ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోపేతం చేసి, అనుకున్నది సాధించిన  యువతరం ‘నయా నమూనా’ పాలక పక్షాలనే కాకుండా అన్ని సంప్రదాయ రాజకీయ పార్టీలనూ కొంత ఆలోచింపజేసింది. ఈ నమూనా ముందుముందు మరింత విస్తరించి,  వేర్వేరు  ప్రజా సమస్యలపై అమలయితే అన్న ప్రశ్న పుట్టడం  సహజం.  పోలీసులు సంయమనం పాటించాలని,  పరిస్థితిని వారు అదుపు చేయాల్సిందే అయినా కర్కశంగా వ్యవహరించకూడదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పింది.  ఒకడుగు  ముందుకు వేసి..  నిరసనకారులకు,  ప్రభుత్వాలకు మధ్య చర్చ,  సంప్రదింపుల  ప్రక్రియ ఉండాలని, ఇరువురి మధ్య ‘గ్యాప్’ తగ్గాలనీ స్పష్టం చేసింది.

వేటి దారి అదే!

ప్రజల ఆకాంక్షలు ఒక తీరున ఉంటే మన రాజకీయాల పంథా మరో తీరున ఉంటోంది.  దీన్ని ప్రజలు  సహజంగానే  చీత్కరిస్తున్నారు.  విద్య, వైద్యం, ఉద్యోగాలు, ఉపాధి, వ్యవసాయం, ఉత్పత్తి వంటి కీలకాంశాలు ప్రభుత్వాల ప్రధాన ఎజెండా కావడం లేదు.  పాలకుల  ప్రాధాన్యతలు  భిన్నంగా  ఉంటున్నాయి.  అందుకే,  మూడు దశాబ్దాల  బీజేపీ  ఆధిపత్యం నీడనున్న  బంకీపూర్ (బిహార్) నియోజకవర్గ  ప్రజలు ఆ పార్టీని తిరస్కరించి,  ప్రశాంత్ కిషోర్ (జన్ సురాజ్)ను  ఎన్నుకున్నారు.  రాజకీయాల్లో  కొత్త గాలికి ఆయన పూచీ  ఇస్తున్నారు.  పరిస్థితులు తలకిందులై పంజాబ్,  గుజరాత్  వలస  కార్మికులు  బిహార్  వస్తే చూడాలనే కోరిక  వెల్లడించారు.  దేశంలో  పోటీ పరీక్షల విధానం సరిగా లేదని,  ‘నీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ వైఫల్యం అందులో భాగమని  ఎన్డీయే  మద్దతుదారుల్లోనే అత్యధికులు అభిప్రాయపడుతున్నట్టు  ఒక  ప్రముఖ సంస్థ  సర్వే తేల్చింది.  

జంతర్ మంతర్, ‘చలో సంసద్’ నిరసనలను  నియంత్రించిన విధానం  సవ్యంగా లేదని,  అభ్యంతరకరంగా ఉందని ఎన్డీయే  అనుకూలురులోనే  40 శాతం  మంది  భావిస్తున్నట్టు సదరు సర్వేలో  వెల్లడయింది.  ఇందులో  ఇంకా చాలా  విషయాలున్నాయి.  పాలకులు ప్రజాభిప్రాయాన్ని మన్నించాల్సిన  అవసరాన్ని ఎత్తి చూపింది.  గత  ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  వీగిపోయిన  నియోజకవర్గాల  పునర్విభజన- మహిళా  రిజర్వేషన్  సవరణ  బిల్లును మార్చి మళ్లీ తీసుకురావడానికి  కేంద్ర ప్రభుత్వం  చేస్తున్న యత్నాలు జనంలో  చర్చనీయాంశమవుతున్నాయి. 

బిల్లు మళ్లీ రావడమంటే, ప్రతిపాదిత అంశాల్లో మార్పా?  లేక  పాలక,  -విపక్ష  సభ్యుల నిష్పత్తిలో మార్పా?  ఏమిటి కారణం అంటున్నారు.  ఈమధ్య కాలంలో  టీఎంసీ,  ఎన్సీపీ,  శివసేన,  ఆప్ వంటి  పలు ప్రతిపక్ష పార్టీలను  నిలువునా చీల్చి, వారి ఎంపీలను తమలో కలిపేసుకున్న  బీజేపీ,  కొత్త బలం ధీమాతోనే  సదరు బిల్లుల కోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు పెడుతోందా?  అన్న సందేహం  ప్రజాక్షేత్రంలో చర్చకు వస్తోంది.  జెన్- జీలు జాగృతమై,  ప్రజాక్షేత్రం  కొత్త రాజకీయ గాలులకు తెర లేపుతున్న తరుణంలో సర్కార్లు ఇంకా  సొంత ఎజెండాను  బలవంతంగా రుద్దగల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వా?  ప్రజాభీష్టాలకు 

తలొగ్గుతాయా?  అన్నది కీలక ప్రశ్న!

ఈ రెండే ముఖ్యం

ప్రజాస్వామ్య వ్యవస్థల జవాబుదారీతనం పెరగాలనే డిమాండ్ అన్ని వైపుల నుంచీ వస్తోంది.  తారస్థాయికి చేరిన  అవినీతిని  నియంత్రించేవిధంగా విద్య, వైద్యం వంటి రంగాలలో  పాలనా, నిర్వహణ సంస్కరణల అవసరాన్ని పలువురు నొక్కి చెబుతున్నారు.  రాజకీయ, అంటే  శాసన వ్యవస్థలోనూ పెనుమార్పు, హేతుబద్ధ  సంస్కరణలు  రావాలంటున్నారు.  ‘ప్రజలు ఉదయం ఒక పార్టీకి  ఓటువేసి గెలిపిస్తే  సాయంత్రం వేరే పార్టీ  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది’  అన్న  సీజేపీ  జాతీయ కన్వీనర్  అభిజిత్  దీప్కే వ్యాఖ్యలు ఇందుకు ప్రతీక.  మీడియా ఏం చేయాలి?  కానీ,  ఏం చేస్తోంది. 

అన్నది కూడా ప్రస్తుతం చర్చనీయాంశమే!  స్థూలంగా  మీడియా రంగంలో సమూలమైన మార్పును ప్రజాక్షేత్రం ఆశిస్తోంది.  న్యాయవ్యవస్థ జవాబుదారీతనం గురించి  ప్రశాంత భూషణ్ వంటి వారు సుదీర్ఘ కాలంగా పోరాడుతున్నారు.  న్యాయస్థానాల తీర్పులు తరచూ వివాదాస్పదం కావడం, పలు విమర్శలకు గురికావడం ప్రజల్లో న్యాయవ్యవస్థపై  విశ్వసనీయతను  తగ్గిస్తోంది. పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ఇప్పుడు సాగుతున్న పాలక-,  విపక్ష గొడవల గందరగోళంలో కొన్ని కీలకమైన బిల్లులు  చర్చలేకుండానే సభ ఆమోదం పొందడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.  

న్యాయమూర్తుల నియామకాలు  సామాజిక న్యాయపరంగా  కాకుండా ఆశ్రిత పక్షపాతంగా జరుగుతున్నాయని,  నియామకాలకు సంబంధించిన ఒక చట్టసవరణ బిల్లు కూడా ఇందులో ఉందని రాజ్యసభ ఎంపీ  మేనకా గురుస్వామి (టీఎంసీ) విమర్శించారు.  పాలకపక్షవాణి  వినిపించేలా,  విపక్షాల గొంతు నొక్కేలా సభా నిర్వహణనూ తప్పుబట్టారు.  పక్షపాతంగా సభను జరిపిస్తూ,  ప్రజలకు  తెలియాల్సిన కీలకాంశాలను సెన్సార్  చేస్తున్నారనీ  ఆమె ఆరోపించారు. అంతటా సంస్కరణల అవసరాన్ని ఈ పరిణామాలు నొక్కి చెబుతున్నాయి. 

- దిలీప్ రెడ్డి ,పొలిటికల్ ఎనలిస్ట్,
 
పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్
ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ 
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. 
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.