- బిహార్, యూపీ, జార్ఖండ్ వర్సిటీల పేరుతో ఫేక్ పీజీ పట్టాలు
- ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని అధికారుల ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ఫేక్ సర్టిఫికెట్లతో సర్కారు ఉద్యోగాలు దక్కించుకున్న జూనియర్ లెక్చరర్ల వ్యవహారం బయటపడింది. నకిలీ పీజీ పట్టాలతో జూనియర్ లెక్చరర్ పోస్టులు పొందిన 36 మందిపై ఇంటర్ విద్యాశాఖ యాక్షన్ మొదలుపెట్టింది. వీరిని సర్వీసు నుంచి తొలగించేందుకు ఇంటర్మీడియట్ రీజనల్ జాయింట్ డైరెక్టర్లు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
నిబంధనల ప్రకారం ఉద్యోగాల నుంచి ఎందుకు తొలగించకూడదో ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. గడువులోగా సమాధానం ఇవ్వకపోతే వెంటనే డిస్మిస్ చేయడంతో పాటు ఫోర్జరీ, క్రిమినల్ కేసులు పెట్టేందుకు అధికారులు రెడీ అవుతున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2014 కంటే ముందు కాంట్రాక్ట్ లెక్చరర్లుగా పనిచేస్తున్న సుమారు 3,300 మందిని 2023లో రెగ్యులరైజ్ చేశారు. దీనిలో భాగంగా రెండో దశ సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టారు. ఇతర రాష్ట్రాల్లోని దాదాపు 16 యూనివర్సిటీల్లో చదివినట్లు చెప్పుకున్న సుమారు 600 మంది సర్టిఫికెట్లను అధికారులు పరిశీలించారు. వీరిలో రెగ్యులర్‌తో పాటు డిస్టెన్స్ మోడ్‌లో చదివిన వారు కూడా ఉన్నారు.
అయితే పీజీ సర్టిఫికెట్లు అసలైనవేనా కాదా తెలుసుకునేందుకు ఇంటర్ బోర్డు అధికారులు సంబంధిత వర్సిటీలకు వివరాలు పంపించారు. ఈ వెరిఫికేషన్‌లో తొలిదశగా 36 మంది ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందినట్లు గుర్తించారు. వీరికి తాజాగా షోకాజ్ నోటీసులు ఇచ్చారు. మరో వంద మంది వివరాలు మాత్రం ఇప్పటివరకు దొరకలేదని అధికారులు చెబుతున్నారు. వీరి డేటాను ‘నాట్ ఫౌండ్’ కింద నమోదు చేశారు. వీరికి కూడా త్వరలో నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.
మొదటి నుంచే అనుమానాలు..
కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేసినప్పటి నుంచే కొంతమంది సర్టిఫికెట్లపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, హర్యానా తదితర రాష్ట్రాల్లోని వర్సిటీల పేర్లతో పీజీ పట్టాలు తెచ్చుకున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా బీహార్‌లోని లలిత్ నారాయణ్ మిథిలా యూనివర్సిటీ, మగధ యూనివర్సిటీ, జార్ఖండ్‌లోని రాంచీ యూనివర్సిటీ, ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ యూనివర్సిటీలకు వెరిఫికేషన్ కోసం పంపగా అసలు విషయం బయటపడింది.
