- లైన్ డిసిప్లిన్ పాటించట్లే నిద్రమత్తు
- సడన్ బ్రేకులూ కారణమే..
- నివారణ చర్యలపై పోలీసులు, హెచ్ఎండీఏ ఫోకస్
హైదరాబాద్ సిటీ, వెలుగు : హైదరాబాద్ ఓఆర్‌ఆర్ పై భారీ ప్రమాదాలు జరుగుతుండడంతో పోలీసులు, హెచ్ఎండీఏ అధికారులు నివారణ చర్యలు ప్రారంభించారు. లేజర్ స్పీడ్ గన్స్, అడ్వాన్సుడ్హై-స్పీడ్ కెమెరాలు , పెట్రోలింగ్ వెహికల్స్ , విజిబుల్ పోలీసింగ్, సైరన్లతో పోలీసులు చర్యలు తీసుకుంటుండగా, హెచ్ఎండీఏ పరిధిలోని హైదరాబాద్గ్రోత్ కారిడార్లిమిటెడ్ఓ కన్సల్టెన్సీని నియమించుకోబోతోంది. మొత్తంగా ఔటర్‌ను జీరో యాక్సిడెంట్జోన్చేయడానికి ప్లాన్చేస్తున్నాయి.
గతేడాది 26 మంది కన్నుమూత
ప్రస్తుతం రోజుకు ఔటర్‌పై 2.80 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా ఎక్కడో చోట ప్రమాదం చోటుచేసుకుంటోంది. ఎక్కువగా ఓవర్ స్పీడ్, లైన్డిసిప్లిన్పాటించకపోవడం, నిద్రమత్తు, సడన్బ్రేకులతో ప్రమాదాలు జరుగుతున్నాయి. గత ఏడాది ఇలా ఓఆర్‌ఆర్‌పై 68 యాక్సిడెంట్లు జరగ్గా, 26 మంది చనిపోయారు. మరో 58 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఈ ఏడాది జూన్ నాటికే 37 ప్రమాదాలు జరగ్గా 17 మంది కన్నుమూశారు. 26 మంది గాయపడ్డారు. ఔటర్‌పై 158 కిలోమీటర్ల పొడవున నగరంలోని వివిధ ప్రాంతాలను లింక్చేస్తూ 19 ఎగ్జిట్, ఎంట్రీ పాయింట్లు ఉండగా ఇందులో కొన్ని చోట్లనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్టు గుర్తించారు. మొత్తం 70 బ్లాక్ స్పాట్లను గుర్తించి యాక్సిడెంట్ల నివారణకు వార్నింగ్బోర్డులు, బ్లింకర్ లైట్లు ఏర్పాటు చేశారు.
ఎక్కడెక్కడ ఎలా జరుగుతున్నాయి?
శంషాబాద్ - పెద్దాపూర్ రోడ్ తుక్కుగూడ స్ట్రెచ్ ఎగ్జిట్14, 15 వద్ద ఎయిర్‌పోర్ట్ వైపు వెళ్లే, వచ్చే వాహనాలు ఓవర్‌స్పీడ్‌తో వస్తుండడం, రాత్రి వేళల్లో లైన్ డిసిప్లేన్ తప్పడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే, పటాన్‌చెరు -సుల్తాన్‌పూర్ స్ట్రెచ్ (ఎగ్జిట్ 3, 4) వద్ద భారీ లారీలు, ట్రక్కులు మూలమలుపుల వద్ద కంట్రోల్ తప్పుతుండడం, మేడ్చల్ జంక్షన్ ఎగ్జిట్ 6 నుంచి నేషనల్హైవే ఎన్ హెచ్-44 కలిసే చోట ఓవర్స్పీడ్వల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. నార్సింగి టీఎస్‌పీఏ జంక్షన్ ఎగ్జిట్17,18 ఐటీ కారిడార్ రూట్కావడంతో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటోంది. సర్వీస్ రోడ్ల వద్ద లేదా ఎంట్రీ ర్యాంప్‌ల దగ్గర సడన్‌బ్రేకులు వేస్తుండడంతో వెనక వచ్చే వాహనాలు ఢీకొని యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఇక పెద్ద అంబర్‌పేట్, -ఘట్‌కేసర్ ఎగ్జిట్ 9,11 వద్ద రాత్రి, తెల్లవారుజామున లాంగ్ డ్రైవ్ చేసే డ్రైవర్లు నిద్రమత్తులోకి వెళ్తుండడం, రోడ్డు పక్కన నిలిపి పడుకుంటుండడంతో ప్రమాదాలు ఎక్కువగా నమోదవుతున్నాయి.
కిలోమీటరుకో లేజర్స్పీడ్గన్..
ఓఆర్‌ఆర్ పై ప్రమాదాలు పెరుగుతుండడంతో హెచ్‌ఎండీఏ, ట్రాఫిక్ పోలీసులు కలిసి ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రతి కిలోమీటరుకు లేజర్ స్పీడ్ గన్స్, అడ్వాన్సుడ్హై-స్పీడ్ కెమెరాలు ఏర్పాటు చేసి స్పీడ్లిమిట్దాటిన వాహనాలకు, రాంగ్ లైన్డ్రైవింగ్చేసేవారికి భారీ జరిమానాలు విధిస్తున్నారు. ప్రమాదాలు జరిగిన వెంటనే బాధితులకు అత్యవసర వైద్యం అందించేందుకు పెట్రోలింగ్ వెహికల్స్ ను అందుబాటులో ఉంచుతున్నారు. ఔటర్‌పై ప్రవేశించే ముందు, ప్రధాన టోల్ ప్లాజాల వద్ద డ్రైవర్లకు నిద్రమత్తు వదిలించేలా విజిబుల్ పోలీసింగ్, సైరన్లు, ప్రత్యేక కౌన్సెలింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రోడ్డు పక్కన నిలిపే వాహనాల (బ్రేక్ డౌన్ వెహికల్స్ ) వల్ల ప్రమాదాలు జరగకుండా, వెంటనే తొలగించేందుకు క్రేన్లను సిద్ధంగా ఉంచాలని, భారీ వెహికల్స్ కచ్చితంగా ఎడమవైపు లైన్లలోనే ప్రయాణించేలా స్ట్రిక్ట్రూల్స్పెట్టారు. లాంగ్ డ్రైవ్‌లలో ఉన్నప్పుడు రెండు గంటలకోసారి కాసేపు విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రయాణంలో వాహనాలు ఎక్కడైనా చెడిపోతే వెంటనే 14449 హెల్ప్‌లైన్ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.
హెచ్‌జీసీఎల్ ఏం చేస్తోందటే..
ఓఆర్‌ఆర్‌పై ప్రమాదాల నివారణకు హెచ్ఎండీఏ అనుబంధ సంస్థ అయిన హైదరాబాద్గ్రోత్కారిడార్ లిమిటెడ్ఆఫీసర్లు ఫోకస్‌పెట్టారు. ఔటర్‌పై భద్రత గురించి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఓ కన్సల్టెన్సీని నియమించుకోబోతున్నారు. 2023లోనే ఆర్‌వీ ఇంజినీరింగ్కన్సల్టెన్సీని మూడేండ్లకు గాను నియమించుకుని రూ.79.84 లక్షలు ఫీజుగా చెల్లించారు. తాజాగా కొత్త కన్సల్టెన్సీ కోసం టెండర్లను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. ఆగస్టు11 వరకు టెండర్లు దాఖలు చేయాలని కోరారు. అదే రోజు టెక్నికల్ బిడ్ ను ఓపెన్ చేయనున్నారు.
కన్సల్టెన్సీ ఏం చేస్తుంది ?
ఎంపికైన కన్సల్టెన్సీ ఔటర్తో పాటు సర్వీస్ రోడ్లు, ఇంటర్‌ఛేంజ్‌లు, ఎంట్రీ, ఎగ్జిట్, ర్యాంపులు, టోల్‌ప్లాజాలు, లైటింగ్, డ్రైనేజీ వ్యవస్థ, ఎమర్జెన్సీ సమయాల్లో తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తాయి. పగలు, రాత్రి ఔటర్‌పై తనిఖీలు నిర్వహించి ట్రాఫిక్ నియంత్రణలో లోపాలపై ఐఆర్ బీ ఇన్ఫ్రాను అప్రమత్తం చేస్తుంది. నిఘా సంస్థల నుంచి ప్రమాదాల సమాచారాన్ని సేకరించి విశ్లేషిస్తుంది. బ్లాక్ స్పాట్ల వద్ద తీసుకోవాల్సిన చర్యలను సిఫార్సు చేస్తుంది. జీఐఎస్డేటా బేస్‌తో ఫొటోలు, వీడియోలు తీసి లోపాలను గుర్తిస్తుంది.
