- సమస్యలు, డిమాండ్ల పరిష్కారానికి మంత్రి వివేక్ హామీ
- గిగ్ వర్కర్ల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టీకరణ
- సంక్షేమ చట్టం అమలుకు త్వరలో గైడ్‌లైన్స్ ఇస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్ల యూనియన్లతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. కార్మికుల సమస్యలు, డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో ఆగస్టు 8 నుంచి చేపట్టాలని నిర్ణయించిన సమ్మెను విరమిస్తున్నట్లు యూనియన్ ప్రతినిధులు ప్రకటించారు. గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికుల సమస్యలపై శుక్రవారం సెక్రటేరియెట్‌లో శక్తి ( కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీలు) శాఖ మంత్రి జి.వివేక్ వెంకటస్వామి యూనియన్ల ప్రతినిధులతో సమావేశమయ్యారు.
కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి ప్రధాన డిమాండ్లు, సంక్షేమం, సామాజిక భద్రత తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికులకు సామాజిక భద్రత కల్పించడంతోపాటు వారి హక్కులను పరిరక్షించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం గిగ్ వర్కర్ల సంక్షేమ చట్టాన్ని తీసుకొచ్చిందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. చట్టాన్ని సమర్థంగా అమలు చేసేందుకు అవసరమైన మార్గదర్శకాలను ప్రభుత్వం రూపొందిస్తోందని చెప్పారు. వాటిని త్వరలోనే అమల్లోకి తీసుకొస్తామని వెల్లడించారు.
చర్చలపై సంతృప్తి.. ప్రభుత్వంపై విశ్వాసం
గిగ్ వర్కర్ల సమస్యలు, యూనియన్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన డిమాండ్లను సానుకూలంగా పరిశీలిస్తామని మంత్రి వివేక్ స్పష్టం చేశారు. కార్మికుల ప్రయోజనాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, సమస్యలకు పరిష్కారం చూపే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చట్టానికి సంబంధించిన మార్గదర్శకాలు అమల్లోకి వచ్చే వరకు గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్లు, యూనియన్లు ఓపికగా ఉండాలని కోరారు.
కార్మికులకు మేలు జరిగేలా అన్ని అంశాలను పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. మంత్రి వివేక్ వెంకటస్వామితో జరిగిన చర్చలపై గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్ల యూనియన్ల ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. తమ సమస్యలు, డిమాండ్లపై మంత్రి సానుకూలంగా స్పందించడంతోపాటు వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై విశ్వాసం వ్యక్తం చేస్తూ శనివారం( ఆగస్టు 8) నుంచి చేపట్టాలని నిర్ణయించిన సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు.
గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం దానిని సమర్థంగా అమలు చేసి తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతుందన్న ఆశాభావాన్ని యూనియన్ ప్రతినిధులు వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కార్మికశాఖ అదనపు కమిషనర్ గంగాధర్, రవాణా శాఖ అధికారులు, గిగ్, ప్లాట్‌ఫామ్ యూనియన్ జేఏసీ నాయకులు పాల్గొన్నారు.
