- అధికారులకు సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ ఆదేశాలు
- వితంతువులు, ఒంటరి మహిళలకు ఫస్ట్ ప్రయారిటీ
- దివ్యాంగులు, తలసేమియా బాధితుల కుటుంబాలకు ఊరట
- అందుబాటులోకి డీఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్ల లాగిన్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సామాజిక భద్రతా పింఛన్‌దారుడు మరణిస్తే, ఎలాంటి జాప్యం లేకుండా వారి జీవిత భాగస్వామికి (స్పౌజ్) వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ‘చేయూత’ పథకంలో భాగంగా ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించింది. ముఖ్యంగా దివ్యాంగులు, తలసేమియా, సికిల్ సెల్ అనీమియా బాధితులు మరణించిన సమయంలో వారి కుటుంబాలు ఆర్థికంగా నిరాశ్రయానికి గురికాకుండా ఉండేందుకు వారి భార్య లేదా భర్తకు తక్షణమే పింఛన్ వర్తింపజేయాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా ఒంటరి మహిళలు, వితంతువులకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నట్టు తెలిపింది.
కొత్త పింఛన్ల మంజూరు, స్పౌజ్ పింఛన్ల ప్రక్రియపై శుక్రవారం ఉన్నతాధికారులతో సెర్ప్ సీఈవో, మెప్మా ఇన్‌చార్జి దివ్య దేవరాజన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. డీఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తక్షణమే కార్యాచరణ ప్రారంభించి, అర్హులకు పింఛన్లు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నిర్ణయాన్ని తక్షణమే అమలు చేసేందుకు వీలుగా డీఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లకు ప్రత్యేక లాగిన్లను అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు.
దుర్వినియోగానికి తావులేకుండా ఉండేందుకు సాధారణ వెబ్‌సైట్‌లో కాకుండా అధికారుల లాగిన్ల ద్వారా మాత్రమే దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ జరిగేలా చర్యలు చేపట్టామన్నారు. అర్హులైన వారందరికీ పింఛన్లు అందిస్తామని, ఎవరూ కంగారు పడొద్దని సీఈవో సూచించారు. దరఖాస్తు ఆన్‌లైన్ అయితే లబ్ధిదారుల ఫోన్‌కు మెసేజ్ వస్తుందని తెలిపారు. ఫోన్‌నంబర్ కరెక్ట్‌గా వేయాలని సూచించారు.
కేటగిరీలవారీగా అర్హతలివే..
చేయూత పింఛన్లలో అర్హులెవరికీ నష్టం జరగకుండా చూస్తామని సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ పేర్కొన్నారు. వితంతువులకు18 ఏండ్లు పైబడి ఉండాలని, భర్త మరణ ధ్రువీకరణ పత్రం సమర్పించాలని చెప్పారు. భర్త వదిలేసినవారు, విడాకులు పొందిన మహిళలకు 18 ఏండ్లు నిండి ఉండాలని, కనీసం ఏడాది విడిగా ఉంటున్నట్టు తహసీల్దార్ విచారణ నివేదిక ఉండాలన్నారు.
వివాహం కాని మహిళలైతే గ్రామీణ ప్రాంతాల్లో 30 ఏండ్లు, పట్టణ ప్రాంతాల్లో 35 ఏండ్లు నిండి ఉండాలని చెప్పారు. దివ్యాంగులు, రక్త సంబంధిత వ్యాధిగ్రస్తులకు వయస్సుతో సంబంధం లేదన్నారు. సదరమ్ సర్టిఫికేట్‌లో కనీసం 40 శాతం (వినికిడి లోపమైతే 51 శాతం) వైకల్యం ఉండాలని తెలిపారు. తలసేమియా, సికిల్ సెల్, హిమోఫీలియాలాంటి బ్లడ్ డిజార్డర్ బాధితులకు కూడా ఈ కేటగిరీ కిందే పింఛన్ వర్తిస్తుందని తెలిపారు. ఇక చేనేత, గీత కార్మికులకు 50 ఏండ్లు నిండి ఉండాలన్నారు.
సొసైటీ సభ్యత్వంతోపాటు ఎక్సైజ్, చేనేత జౌళి శాఖల ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని పేర్కొన్నారు. ఫైలేరియా గ్రేడ్ 2, 3 బాధితులకు డీఎంహెచ్‌వో సర్టిఫికేట్ ఉండాలని, ఆరోగ్యశ్రీ కింద డయాలసిస్ చికిత్స పొందుతున్నవారికి వయస్సుతో సంబంధం లేకుండా పింఛన్ అందిస్తామని చెప్పారు.
