స్కిల్ యూనివర్శిటీలో తెలంగాణ రైజింగ్ సమ్మిట్: మంత్రి వివేక్

స్కిల్ యూనివర్శిటీలో తెలంగాణ రైజింగ్ సమ్మిట్: మంత్రి వివేక్

హైదరాబాద్: డిసెంబర్‎లో జరగనున్న తెలంగాణ రైజింగ్ సమ్మిట్‎ను ఫ్యూచర్ సిటీలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీలో నిర్వహిస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. మంగళవారం (సెప్టెంబర్ 22) రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీరాఖాన్ పేట్ సమీపంలో నిర్మిస్తోన్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్డింగ్ నిర్మాణ పనులను మంత్రి వివేక్ పరిశీలించారు. 

అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్‎లో జరగనున్న తెలంగాణ రైజింగ్ సమ్మిట్‎ను స్కిల్ యూనివర్సిటీలో నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని తెలిపారు. కాంట్రాక్టర్లు, అధికారులతో స్కిల్ యూనివర్సిటీ భవన నిర్మాణ పనులపై రివ్యూ నిర్వహించానని.. రోడ్లు, డ్రైన్ ఇతర పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించానని చెప్పారు. 

తెలంగాణ రైజింగ్ సమ్మిట్‎కు అవసరమైన అన్ని పనులు అక్టోబర్ 31 వరకు పూర్తి చేసి ఈవెంట్ మేనేజర్‎కు భవనాన్ని అప్పగిస్తామన్నారు. సమ్మిట్ కోసం 300 మంది కూర్చునే కెపాసిటీతో కూడిన 6 సెమినార్ హాల్స్ ఏర్పాటు చేస్తున్నామని.. అలాగే మరో మూడు పెద్ద హాల్స్ తయారు చేస్తున్నామని చెప్పారు. మరో 10 హాల్స్ మంత్రులు, డేలిగేట్స్ కోసం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

 సమ్మిట్ ఐపోయాక బిల్డింగ్‎ను స్కిల్ యూనివర్సిటీకి అప్పగిస్తామని చెప్పారు. స్కిల్ యూనివర్సిటీని ఇంటర్నేషనల్ యూనివర్సిటీ చేయాలని ఆలోచన ఉందన్నారు. ఫిబ్రవరి వరకు స్కిల్ యూనివర్సిటీ బాయ్స్, గర్ల్స్ హాస్టల్స్, డైనింగ్ హాల్స్ వర్క్స్ కంప్లీట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.