మహిళలు పిండ ప్రదానం చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతుందంటే..

మహిళలు పిండ ప్రదానం చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతుందంటే..

పితృ దేవతల ఆత్మ శాంతి కోసం శ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానం చేస్తుంటారు. అయితే.. ఈ పిండ ప్రదానం ఎక్కువగా పురుషులే చేస్తుండటంతో మహిళలు ఇందుకు అనర్హులనే నమ్మకం సమాజంలో పాతుకుపోయింది. అయితే.. శ్రాద్ధ కర్మలు చేసే అవకాశం పురుషులకే పరిమితం కాదు. పరిస్థితులను బట్టి, మత గ్రంథాలు మహిళలకు కూడా పిండ ప్రదానం చేసే హక్కును కల్పించాయి. అయితే.. ఈ పద్ధతి కుటుంబ సంప్రదాయాలు, తెగలను బట్టి మారుతుండొచ్చు.

అయితే.. స్త్రీలు శ్రాద్ధ తర్పణం చేసే విషయంలో గరుడ పురాణం ఏం చెబుతుందంటే.. "పుత్రభావే వధువు: కుర్యాత్ ఆర్యభావే శిష్య ఏవ వా..." ఇది గరుణ పురాణంలోని ఒక శ్లోకం. ఈ శ్లోకం అర్థం ఏంటంటే.. పరిస్థితులను బట్టి భార్య లేదా కోడలు శ్రాద్ధ కర్మలు చేయవచ్చు. వాళ్లు అందుబాటులో లేకపోతే.. సోదరుడు, మేనల్లుడు, మేనకోడలు కూడా ఈ కర్మలను నిర్వహించవచ్చు. అయితే.. కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోతే.. స్నేహితుడు, శిష్యుడు శ్రాద్ధ కర్మలను నిర్వహించడం ఆనవాయితీ. మొత్తంగా.. శ్రాద్ధ కర్మలుు కేవలం పురుషులకే పరిమితం అనే భావన సరైంది కాదని ఈ శ్లోకం సూచిస్తుంది.

మహిళలు శ్రాద్ధ కర్మలు చేసే విషయంలో ఒక కథ మనకు ప్రచారంలో ఉంది. దశరథ మహారాజుకు సీతాదేవి పిండ ప్రదానం చేశారనేది ఆ కథ సారాంశం. సీతారాములు వనవాస సమయంలో ఉండగా దశరథ మహారాజు కాలం చేశారు. ఈ విషయం తెలిసి శ్రీరాముడు, సీతా దేవి, లక్ష్మణుడు గయకు చేరుకున్నారు. శ్రీరాముడు, లక్ష్మణుడు.. దశరథ మహారాజు శ్రాద్ధానికి కావాల్సిన సామాగ్రిని తీసుకురావడానికి వెళతారు.

అయితే.. సమయం ముగియక ముందే పిండ ప్రదానం చేయాల్సి రావడంతో సీతామాతనే దశరథ మహారాజుకు పిండ ప్రదానం చేశారు. ఫల్గు నది, కేతకి పుష్పం, మర్రిచెట్టును సాక్ష్యులుగా చేసుకుని.. ఇసుకతో ఒక పిండాన్ని తయారు చేసి దశరథ మహారాజుకు సమర్పించారు. ఇలా స్త్రీలు పిండ ప్రదానం చేయడం మన పురాణాల్లోనే ఉందని ఒక ఉదాహరణగా చెబుతుంటారు.