సినిమా అంటే భారీ బడ్జెట్.. స్టార్ హీరో.. హై-వోల్టేజ్ యాక్షన్.. వందల కోట్ల పెట్టుబడి.. ఇవన్నీ ఉంటే బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురుస్తుందని ఒకప్పుడు అనుకునేవారు. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ క్రమంగా మారుతోంది. కంటెంట్‌లో దమ్ముంటే చాలు.. చిన్న సినిమా అయినా థియేటర్ల దగ్గర పెద్ద నంబర్స్ రాబట్టగలదు. అదే కథ, కథనం ప్రేక్షకులకు కనెక్ట్ కాకపోతే.. ఎంత పెద్ద బడ్జెట్ పెట్టినా బాక్సాఫీస్ దగ్గర పరిస్థితి తారుమారవుతుంది. దీనికి తాజా ఉదాహరణగా నిలుస్తోంది ‘హైవాన్’ సినిమా (Haiwaan).
రూ.130 కోట్ల సినిమా పరిస్థితి ఇది..
అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ వంటి స్టార్ కాస్టింగ్, థ్రిల్లర్ జానర్, అందులోనూ స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్. ఇలా సినిమాపై విడుదలకు ముందే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. పైగా మహారాష్ట్రలో లాంగ్ వీకెండ్ కూడా కలిసొచ్చే పరిస్థితి కనిపించింది. కానీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత మాత్రం సినిమాకు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ దక్కలేదు. ఈ క్రమంలోనే రూ.130 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు 8వ రోజు కలెక్షన్స్.. జస్ట్ 66 వేల రూపాయల స్థాయికి పడిపోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ‘హైవాన్’ బాక్సాఫీస్ లెక్కలు గమనిస్తే..
రూ.8.68 కోట్ల దగ్గరే ఫస్ట్ వీక్..
మొదటి రోజే రూ.2.79 కోట్లు రాబట్టిన ‘హైవాన్’.. రెండో రోజు రూ.2.13 కోట్లకు పడిపోయింది. ఆదివారం మరోసారి డ్రాప్ అయి కేవలం రూ.1.58 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దీంతో వీకెండ్ పూర్తయ్యే సరికి సినిమా ట్రెండ్‌పై ట్రేడ్‌లో ఆందోళన మొదలైంది. వీక్‌డేస్‌లోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. సోమవారం రూ.64 లక్షలు, మంగళవారం రూ.59 లక్షలు, బుధవారం రూ.47 లక్షలు, గురువారం రూ.48 లక్షలు మాత్రమే వచ్చాయి. దీంతో ఫస్ట్ వీక్ పూర్తయ్యేసరికి ‘హైవాన్’ ఇండియా నెట్ కలెక్షన్స్ రూ.8.68 కోట్లకు చేరాయి.
ఇక రెండో వారంలో అయినా సినిమా పుంజుకుని కనీసం రూ.10 కోట్ల మార్క్‌ను అందుకుంటుందేమోనని ఆశించిన ట్రేడ్ వర్గాలకు రెండో శుక్రవారం కలెక్షన్స్ షాక్ ఇచ్చాయి. సెప్టెంబర్ 18న వచ్చిన సెకండ్ ఫ్రైడే రోజున ‘హైవాన్’ కేవలం రూ.66,838 మాత్రమే వసూలు చేసినట్లు ట్రేడ్ రిపోర్ట్స్ వెల్లడించాయి. అంటే తొలి వారంలోని గురువారంతో పోలిస్తే రెండో శుక్రవారం సినిమా ఏకంగా 98.62 శాతం భారీ డ్రాప్ నమోదు చేసింది. రూ.130 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాకు 8వ రోజు కలెక్షన్స్ రూ.66 వేల రూపాయల స్థాయికి పడిపోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇక్కడే అసలు పాయింట్ ఏంటంటే.. స్టార్ హీరోలు ఉన్నంత మాత్రాన, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు పెట్టినంత మాత్రాన, వందల కోట్లు ఖర్చు చేసినంత మాత్రాన సినిమా హిట్ అవుతుందా? అంటే సమాధానం బాక్సాఫీస్‌నే చెబుతోంది.
ప్రేక్షకుడిని థియేటర్‌కి రప్పించేది స్టార్ పవర్ కావచ్చు.. కానీ అతడిని చివరి వరకు కూర్చోబెట్టేది మాత్రం కథ, కథనం, ఎంగేజ్‌మెంట్, మౌత్ టాక్. కంటెంట్ వర్కౌట్ అయితే చిన్న సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. అదే కంటెంట్ క్లిక్ కాకపోతే.. భారీ బడ్జెట్ కూడా కాపాడలేని పరిస్థితి కనిపిస్తోంది.
ప్రస్తుతం ‘హైవాన్’ బాక్సాఫీస్ నంబర్స్ చూస్తుంటే.. బడ్జెట్ ఎంత? స్టార్ హీరో ఎవరు? యాక్షన్ ఎంత భారీగా ఉంది? అనే ప్రశ్నల కంటే.. “కథ ఎంత బాగుంది?” అనేదే థియేటర్ దగ్గర అసలు గేమ్‌ను డిసైడ్ చేస్తోందనే చర్చ మొదలైంది.
కథేంటి?
‘హైవాన్’ కథ చూపులేని మెయింటెనెన్స్ మేనేజర్ శ్యామ్ (సైఫ్ అలీ ఖాన్) అంధుడి చుట్టూ తిరుగుతుంది. చూపు లేకపోయినా శబ్దం, వాసన, స్పర్శ ద్వారా మనుషులను, వారి కదలికలను గుర్తించే ప్రత్యేక సామర్థ్యం అతడికి ఉంటుంది. ఓ మాజీ జడ్జి (బోమన్ ఇరానీ) హత్యకు గురైన తర్వాత, ఆ కేసులో అసలు హంతకుడిని గుర్తించే కీలక సాక్షిగా శ్యామ్ మారతాడు. మరోవైపు తన గతానికి ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చిన పరశురామ్ (అక్షయ్ కుమార్) వరుసగా టార్గెట్లను వెంటాడుతుంటాడు. దీంతో శ్యామ్, పరశురామ్ మధ్య జరిగే క్యాట్ అండ్ మౌస్ గేమ్‌గా కథ సాగుతుంది. చివరికి తన ప్రత్యేకమైన సామర్థ్యాలను ఉపయోగించి శ్యామ్ హంతకుడిని ఎలా ఎదుర్కొన్నాడన్నదే సినిమా మెయిన్ పాయింట్.
