16వ ఆర్థిక సంఘం నిధులు నీరు, పారిశుధ్యానికే.. టైట్ గ్రాంట్స్ వినియోగంపై కేంద్రం మార్గదర్శకాలు

16వ ఆర్థిక సంఘం నిధులు నీరు, పారిశుధ్యానికే.. టైట్ గ్రాంట్స్ వినియోగంపై కేంద్రం మార్గదర్శకాలు

దేశవ్యాప్తంగా గ్రామాలకు ఐదేండ్లలో రూ.4.35 లక్షల కోట్లు
తెలంగాణకు రూ. 9,968 కోట్లు.. నీళ్లు, పరిశుభ్రతకే రూ.3,987 కోట్లు 
జీతాలు, వాహనాలు, ఆఫీసు భవనాల కొనుగోలుకు వాడొద్దని సూచన
జీపీడీపీ ప్రణాళికలు ఆగస్టు 15లోగా ఈ -గ్రామ్‌‌‌‌స్వరాజ్ పోర్టల్‌‌‌‌లో అప్ లోడ్ చేయాలని ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు : దేశంలోని గ్రామ పంచాయతీలకు 16వ ఆర్థిక సంఘం కేటాయించిన 'టైడ్ గ్రాంట్ల' నిధుల్లో నీరు, పారిశుధ్యానికి ప్రయారిటీ ఇచ్చింది. బేసిక్ గ్రాంట్ లో 50 శాతం నిధులను వీటికే కేటాయించాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. కొత్త పనులపై ఆంక్షలు విధించడంతో పాటు జీతాలు, వాహనాలు, ఆఫీసు భవనాల కొనుగోళ్లకు ఈ నిధులు వాడొద్దని పేర్కొంది.

2026=27 ఆర్థిక సంవత్సరానికి గానూ గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను (జీపీడీపీ) ఆమోదించి ఆగస్టు 15 నాటికి 'ఈ-గ్రామ్‌‌‌‌ స్వరాజ్' పోర్టల్‌‌‌‌లో అప్‌‌‌‌లోడ్ చేయాలని స్పష్టం చేసింది. ఇటీవల కేంద్ర కేబినెట్ ఆమోదించిన జేజేఎం 2.0, స్వచ్ఛ భారత్ మిషన్ గ్రేడ్-2 లక్ష్యాలకు అనుగుణంగానే ఈ నిధులను ఖర్చు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు జలశక్తి శాఖ కార్యదర్శి నితేశ్ కుమార్ అన్ని రాష్ట్రాల సీఎస్ లు, పంచాయతీరాజ్, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖల ముఖ్య కార్యదర్శులకు ఉత్తర్వులు పంపారు. 

స్థానిక సంస్థలకు రూ. 7.91 లక్షల కోట్లు

16వ ఆర్థిక సంఘం 2026 =-27 నుంచి 2030=-31 వరకు ఐదేండ్ల కాలానికి దేశంలోని స్థానిక సంస్థలకు ఏకంగా రూ. 7.91 లక్షల కోట్లు కేటాయించింది. ఇది 15వ ఆర్థిక సంఘం కేటాయించిన రూ. 2,36,805 కోట్ల కంటే 84 శాతం అధికం. మొత్తం నిధుల్లో గ్రామీణ స్థానిక సంస్థలకు (ఆర్​ఎల్​బీ) రూ. 4,35,236 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలు (యూఎల్​బీ) రూ. 2.90 లక్షల కోట్లు కేటాయించింది.

గ్రామీణ సంస్థలకు కేటాయించిన బేసిక్ గ్రాంట్లు రూ. 3,48,188 కోట్లలో టైడ్ గ్రాంట్లు రూ. 1,74,094 కోట్లు (నీరు, పారిశుధ్యం), అన్ టైడ్ గ్రాంట్ల కింద రూ.1,74,094 కోట్లు (స్థానిక అవసరాలకు) కేటాయించగా పర్ఫార్మెన్స్ గ్రాంట్లుగా రూ. 87,048 కోట్లు కేటాయించారు. 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థలకు ఐదేండ్లలో మొత్తం రూ. 9,968 కోట్లు అందనున్నాయి. ఇందులో కేవలం తాగునీరు, పరిశుభ్రతకే రూ.3,987 కోట్లు కేటాయించారు. 

నీటి వనరుల పరిరక్షణ, ప్రత్యామ్నాయ సరఫరా ఏర్పాట్లు

గ్రామాల్లో నీటి కొరత రాకుండా ఉండటానికి, పాత తాగునీటి పథకాల నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తూ 16 రకాల ప్రత్యేక పనులకు మాత్రమే నిధులను ఖర్చు చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. గ్రామాల్లో బావులు, బోర్లు, ఊటబావుల పూడికతీత పనులు చేపట్టడంతో పాటు వాటి చుట్టూ రక్షణ గోడలు, కంచెలు నిర్మించవచ్చని, నీటి వనరుల పరిసరాల్లోని ఆక్రమణలను తొలగించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే పనులు చేపట్టవచ్చని పేర్కొంది. గ్రామంలో ఉన్న బోర్లు, చేతి పంపులు ఇంకిపోయినా, పనిచేయకపోయినా ప్రత్యామ్నాయ నీటి వనరులను అభివృద్ధి చేసుకునేందుకు ఈ నిధులను వాడుకోవచ్చు. నీటి ఎద్దడి సమయాల్లో అత్యవసరంగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు అనుమతి ఇచ్చారు.

మోటార్లు, పంపులు, ప్యానెల్ బోర్డులు, వాల్వ్‌‌‌‌లకు చిన్నపాటి రిపేర్లు చేయడం, లీకేజీలు అరికట్టడం వంటి పనులు చేసే అవకాశం ఉంటుంది. గ్రామాల్లోని ట్యాంకులను క్లీన్ చేయడం, బ్లీచింగ్ చల్లడం, లీకేజీలకు ప్లాస్టరింగ్ చేయడం వంటి నిర్వహణ పనులు సైతం చేపట్టవచ్చని పేర్కొంది. దీంతో పాటు గ్రామంలోని స్కూళ్లు, అంగన్ వాడీ కేంద్రాలు, పీహెచ్ సీలు, పంచాయతీ భవనాలు, సంతలు, బస్టాండ్లు, ఆట స్థలాల వంటి ప్రాంతాల్లో నీటి సదుపాయాలనుకల్పించవచ్చు.

ప్రజలకు వ్యాధులు రాకుండా సురక్షితమైన నీటిని అందించేందుకు నీటి నాణ్యత తనిఖీలకు, శుద్ధీకరణకు నిధులు కేటాయించనున్నారు. తాగునీటి పథకాలను నడిపే సిబ్బందికి, విద్యుత్ వ్యయాలకు ఈ నిధులు ఆసరాగా నిలవనున్నాయి. నీటి పథకాలకు సంబంధించిన కరెంట్ బిల్లుల బకాయిలు చెల్లించడంతో పాటు సోలార్ పానెళ్ల ఏర్పాటుకు వెసులుబాటు కల్పించారు. తాగునీటి వినియోగం, సంరక్షణలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు గ్రామంలో 'వాటర్ బడ్జెటింగ్' చేయనున్నారు. 'జల చౌపాల్' సమావేశాలు నిర్వహించడం, 'జల సేవా అంకెలన్' నివేదికలను గ్రామసభకు సమర్పించడం, 'లోక్ జల్ ఉత్సవ్' పేరిట అవగాహన కార్యక్రమాలు
 నిర్వహించనున్నారు. 

ఆగస్టు 15లోగా ప్రణాళికలు

16వ ఆర్థిక సంఘం 'టైడ్' నిధుల వినియోగానికి సంబంధించి గ్రామ పంచాయతీలు తమ అభివృద్ధి ప్రణాళికలను ఈ నెల 15వ తేదీలోగా 'ఈ గ్రామ్‌‌‌‌ స్వరాజ్' పోర్టల్‌‌‌‌లో అప్‌‌‌‌లోడ్ చేయాలని పేర్కొంది. శాశ్వత సిబ్బంది జీతభత్యాలు, పంచాయతీ భవనాల నిర్మాణం, సొంత వాహనాల కొనుగోలుకు ఈ నిధులు వాడకూడదని మార్గదర్శకాల్లో పేర్కొంది. పథకాలకు నిధుల మళ్లింపు, నిరుపయోగ ప్రాజెక్టులను వదిలి కొత్తవి కట్టకూడదని స్పష్టం చేసింది.

కేంద్రం నిధులు విడుదల చేసిన 10 పని దినాల్లోగా వాటిని రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు జమ చేయాలని, ఆలస్యమైతే వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశించింది. అర్హత సాధించిన పంచాయతీలకు కేంద్రం నేరుగానే నిధులు ఇవ్వనుంది. పంచాయతీల్లో నెలకు ఒకసారి, జిల్లాలో మూడు నెలలకు, రాష్ట్రంలో ఆరు నెలలకోసారి ఆడిట్ నిర్వహించనున్నారు.  

రాష్ట్రానికి వచ్చే నిధులు (కోట్లలో..)
 
వివరాలు     2026-27    2027-28    2028-29    2029-30    2030-31    మొత్తం 
టైడ్ గ్రాంట్స్    640    710.5    789    875.5    972    3,987
అన్-టైడ్ గ్రాంట్స్    640    710.5    789    875.5    972    3,987
పర్ఫార్మెన్స్ గ్రాంట్స్    0    212    533    592    657    1,994
మొత్తం    1,280    1,633    2,111    2,343    2,601    9,968