హైదరాబాద్, వెలుగు: ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లోని పల్లెలు, గిరిజన తండాల్లో తాగునీటి సమస్య నివారణకు ప్రభుత్వం భారీ నిధులను మంజూరు చేసింది. ‘మిషన్ భగీరథ’ పథకం కింద ప్రత్యామ్నాయ తాగునీటి ఏర్పాట్లు, అదనపు నీటి సరఫరా పనుల కోసం రూ. 20.96 కోట్లు కేటాయిస్తూ శుక్రవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.దానకిశోర్ పాలనా అనుమతులు జారీ చేశారు.
ఏజెన్సీ, మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు తాగునీటి కొరత రాకుండా చూడటమే లక్ష్యంగా 108 ఆవాస ప్రాంతాల్లో ఈ నిధులతో మౌలిక వసతులు కల్పించనున్నారు. ములుగు జిల్లాలోని ములుగు, మల్లంపల్లి, తాడ్వాయి, వెంకటాపూర్, గోవిందరావుపేట, కన్నాయిగూడెం, ఏటూరునాగారం, మంగపేట, వెంకటాపురం, వాజేడు మండలాలు, మహబూబాబాద్ జిల్లాలోని ఏజెన్సీ మండలాలైన కొత్తగూడ, గంగారం మండలాల్లోనూ ఈ పనులు నిర్వహిస్తారు.
కొత్తగా ఓవర్‌హెడ్ సర్వీస్ రిజర్వాయర్ల నిర్మాణం, నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో భూగర్భ జల నిపుణుల సర్వే ఆధారంగా కొత్త బోర్ల తవ్వకం, పంప్‌సెట్లు అమర్చనున్నారు. వీధుల్లో కొత్త పైప్‌లైన్ల నిర్మాణం, ఇళ్లకు తాగునీటి కనెక్షన్లు ఇవ్వనున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, నిర్దేశిత కాలవ్యవధిలో పనులు పూర్తి చేయాలని పంచాయతీరాజ్, మిషన్ భగీరథ ఈఎన్‌సీ సూపరింటెండింగ్ ఇంజనీర్లను ప్రభుత్వం ఆదేశించింది.
