ఉత్సాహం.. ఉత్కంఠ.. ఉల్లాసం... హైదరాబాద్ శివారులో రాక్ క్లైంబింగ్ జోష్.. మహిళ్లలోనూ క్లైంబింగ్ క్రేజ్..

ఉత్సాహం.. ఉత్కంఠ.. ఉల్లాసం... హైదరాబాద్ శివారులో రాక్ క్లైంబింగ్ జోష్.. మహిళ్లలోనూ క్లైంబింగ్ క్రేజ్..

మొన్నటివరకు జిమ్‌‌లో చెమటలు చిందించిన వాళ్లు.. ఇప్పుడు గోడలెక్కుతున్నారు!  చేతులకు గ్రిప్.. కాళ్లకు బ్యాలెన్స్.. కళ్లంతా టార్గెట్‌‌పైనే! ఎత్తుకు చేరే కొద్దీ ఉత్కంఠ.. పట్టు జారితే ప్రమాదం.. అయినా వెనక్కి తగ్గడం లేదు హైదరాబాద్ యూత్. ఫిట్‌‌నెస్‌‌తోపాటు 

అడ్వెంచర్‌‌ ను ఆస్వాదిస్తూ.. 

కొత్త చాలెంజ్‌‌ల కోసం క్లైంబింగ్ వైపు అడుగులు వేస్తున్నారు. ఇదే ఇప్పుడు హైదరాబాద్ క్లైంబర్స్ కొత్త ట్రెండ్! గోడలపై మొదలైన ఈ క్లైంబింగ్ క్రేజ్.. ఇప్పుడు హైదరాబాద్ యూత్‌‌కు ఫిట్‌‌నెస్‌‌తోపాటు కాన్ఫిడెన్స్, అడ్వెంచర్‌‌కు కొత్త నిర్వచనంగా మారుతోంది. 

‘‘కొండలైనా ఎక్కగలం.. కోనలైనా దాటగలం.. గుండెల్లోన ధైర్యముంటే చుక్కల్లోకెక్కగలం..’’ అని ప్రముఖ సినీ కవి సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన పాట.. నాడు ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ప్రస్తుతం హైదరాబాద్ క్లైంబర్స్ ఆ పాట పాడుకుంటూ కొండలెక్కుతున్నారు!

రోజువారీ ఆఫీస్ రొటీన్, స్క్రీన్ టైమ్, జిమ్‌‌లో సాధారణ వర్క్అవుట్లకు భిన్నంగా అడ్వెంచర్, ఫిట్‌‌నెస్ కలయికగా క్లైంబింగ్‌‌ను యువత ఎంచుకుంటున్నారు. క్లైంబింగ్‌‌ కేవలం అడ్వెంచర్ కాదు.. ఫుల్ బాడీ వర్క్​అవుట్.​ చేతులు, భుజాలు, వీపు, కోర్, కాళ్లకు బలం అవసరం అంటారు ఫిట్​నెస్ నిపుణులు. అదే సమయంలో దీనికి బ్యాలెన్స్, ఏకాగ్రత, సమస్య పరిష్కార నైపుణ్యాలు కూడా అవసరం అంటారు ప్రొఫెషనల్ పర్వతారోహకులు. 

హైదరాబాద్ క్లైంబర్స్ క్లబ్ గత10 సంవత్సరాలుగా అవుట్​డోర్ రాక్ క్లైంబింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. కొండలపై ఎక్కే నైపుణ్యాలను పెంపొందించడం, క్రీడపై ప్రేమను ప్రోత్సహించడం లక్ష్యంగా శిక్షణా కార్యక్రమాలు, వర్క్‌‌షాప్‌‌లు, క్రమం తప్పని క్లైంబింగ్ ఈవెంట్‌‌లను అందిస్తోంది.

క్లైంబింగ్ హాట్ స్పాట్స్

సిటీలోని ఖాజాగూడ కొండలు, మౌలాలి కొండ, దుర్గం చెరువు కొండలు, గుట్టలు, మహేంద్రహిల్స్ పర్వతం, ఘర్ ఏ ముబారక్, సూరారం గుట్టల్లో పర్వతారోహకులు నిత్యం ఎక్కుతూ థ్రిల్ ఫీలవుతుంటారు. తెలంగాణలో వరంగల్, అడక్కల్, మర్రిగూడెం, మంచిర్యాల కొండలు క్లైంబర్స్​కు కేంద్రాలుగా మారాయి. 

ఇవేకాకుండా ఇతర రాష్ట్రాల్లోని హంపీ, బాదామీ(కర్ణాటక), హిమాచల్ ప్రదేశ్​లోని రక్చం, కిన్నౌర్, హ్యాంగ్రాంగ్ వ్యాలీ, హంఠవ్యాలీ, కార్గిల్ వ్యాలీ ప్రాంతాల్లో హైదరాబాద్ పర్వతారోహకులు ఈవెంట్లలో పాల్గొన్నారు. నార్వే, థాయ్​లాండ్, వియత్నాం, గ్రీస్, ఇటలీ, పోలెండ్, ఇండోనేసియా దేశాల్లోని పర్వతాలపై జరిగిన క్లైంబింగ్ ఈవెంట్లలో హైదరాబాదీలు పాల్గొన్నారు.

క్లైంబింగ్ ఈవెంట్స్ ఎన్నో..

హైదరాబాద్ క్లైంబర్స్ క్లబ్ ప్రతి నెలా పర్వతాలు ఎక్కే వారికోసం వర్క్​షాప్​లు నిర్వహిస్తోంది. క్లైంబర్ల ప్రారంభ స్థాయి నుంచి అధునాతన స్థాయి క్లైంబర్ల వరకు రూపొందించిన వివిధ ఈవెంట్‌‌లను నిర్వహిస్తోంది. భద్రత, పర్యావరణ పరిరక్షణ బాధ్యతగా శారీరక దృఢత్వాన్ని, జట్టు స్ఫూర్తిని ప్రోత్సహిస్తోంది. టాప్ రోపింగ్ అండ్ నాట్స్, రాపెల్లింగ్, ఇంటర్మీడియెట్ క్లైంబింగ్ వర్క్​షాప్, బాదామీ క్లైంబింగ్ వర్క్​షాప్​లు నిర్వహిస్తోంది. 

ప్రతి నెలా ఖాజాగూడ కొండలపై రాపెల్లింగ్ శిక్షణ ఇస్తున్నారు. పిల్లలు, పెద్దల కోసం క్రమం తప్పకుండా ఈవెంట్‌‌లను క్లబ్ నిర్వహిస్తోంది. ఈ శిక్షణలో 5 ఏళ్ల వయసు నుంచి పెద్దల దాకా పాల్గొంటున్నారు. తాము హైదరాబాద్‌‌లోని ఖాజాగూడ, ఘర్- ఎ- ముబారక్, దుర్గం చెరువు, మౌలాలి కొండలను అధిరోహిస్తామని స్పోర్ట్ ట్రేడ్ అండ్ రాక్ క్లైంబింగ్ సొసైటీ ఉపాధ్యక్షుడు విశ్వతేజ పొలాలి చెప్పారు. 

హైదరాబాద్ బయట వరంగల్, అడక్కల్, మర్రిగూడెం, మంచిర్యాలలోని కొండలతోపాటు తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న కొండలను ఎక్కుతున్నామని ఆయన తెలిపారు. గత మూడు సంవత్సరాలుగా థాయ్‌‌లాండ్, వియత్నాం, ఇండోనేసియా, గ్రీస్, ఇటలీ, యూకే వంటి దేశాల్లోని కొండలను అధిరోహిస్తూ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎదిగామని విశ్వతేజ వివరించారు.

క్లైంబింగ్ శిక్షణా తరగతులు

క్లైంబింగ్ క్లబ్ సిటీలో పిల్లలు, పెద్దల క్లైంబింగ్ కోసం వేర్వేరుగా శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు.18 ఏళ్లు పైబడిన వారిలో బలం, ఓర్పు, క్లైంబింగ్ టెక్నిక్, చలనశీలత, సమస్య- పరిష్కార నైపుణ్యాలను పెంపొందించడానికి క్రమబద్ధమైన క్లైంబింగ్, ఫిట్‌‌నెస్ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ సెషన్‌‌లలో మూడు విభాగాలు ఉన్నాయి. బౌల్డరింగ్, టాప్ రోప్, లీడ్ క్లైంబింగ్ సెషన్లు నిర్వహిస్తున్నారు. 

ప్రతి సెషన్ 90 నిమిషాలు ఉంటుంది. వారం రోజుల్లో శిక్షణ క్లైంబింగ్, శారీరక దృఢత్వంలోని విభిన్న అంశాలపై దృష్టి పెడుతున్నారు. వీకెండ్స్​లో అవుట్‌‌డోర్ క్లైంబింగ్ సెషన్‌‌లు నిర్వహిస్తున్నారు. ఎగబాకే కొండల ఎత్తు పెరిగేకొద్దీ సవాలు పెరుగుతుంది.. సవాలు పెరిగేకొద్దీ ఉత్సాహం రెట్టింపవుతుందని నగరానికి చెందిన ఔత్సాహిక క్లైంబర్ స్నేహ చెప్పారు. కొండలు ఎక్కాలనుకునే వారికి తాము ఇండోర్ స్టూడియోల్లో శిక్షణ ఇస్తున్నామని గచ్చిబౌలి క్రాగ్ స్టూడియో ఫౌండర్ దేవికారాణి చెప్పారు.

హైదరాబాద్ క్లైంబర్స్ క్లబ్ 

తెలంగాణలో రాక్ క్లైంబింగ్ క్రీడను ప్రోత్సహించేందుకు స్పోర్ట్ ట్రేడ్ అండ్ రాక్ క్లైంబింగ్ సొసైటీ (STARCS) హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోంది. హైదరాబాద్ క్లైంబర్స్ క్లబ్ స్ట్రాక్స్​ను అనుబంధంగా కార్యక్రమాలు చేపడుతోంది. హైదరాబాద్ క్లైంబర్స్ క్లబ్ ఇండియన్ మౌంటెనీరింగ్ ఫౌండేషన్​కు అనుబంధంగా ఏర్పడింది. 

హైదరాబాద్ సిటీలో డేటా సైంటిస్ట్​గా పనిచేస్తున్న విశ్వతేజ పొలాలి పర్వతారోహణపై ఆసక్తితో గత అయిదేళ్లుగా రాక్ క్లైంబింగ్ చేస్తున్నారు. హైదరాబాద్ క్లైంబర్స్ క్లబ్ ఉపాధ్యక్షుడిగా సేవలందిస్తూ యువతకు రాక్ క్లైంబింగ్​లో శిక్షణ ఇస్తున్నారు. మహిళా పారిశ్రామికవేత్త అయిన సరిత కోగంటి క్లైంబింగ్ పట్ల మక్కువతో ఏడేళ్లుగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గతంలో 20 మంది సభ్యులతో ఏర్పాటైన ఈ క్లబ్ 500 మంది చురుకైన క్లైంబర్ల బృందంగా ఎదిగింది.

కోచ్​ మార్గదర్శకత్వంలో..

క్లైంబర్స్​ సౌకర్యవంతమైన అథ్లెటిక్ దుస్తులు ధరించి వాటర్ బాటిల్ తీసుకొస్తుంటారు. క్లైంబింగ్ చేసే ముందు ప్రత్యేక షూ ధరించి అనుభవజ్ఞులైన కోచ్​ల మార్గదర్శకత్వంలో వివిధ స్థాయిల క్లైంబర్​లు కలిసి శిక్షణ ఇస్తున్నారు. ప్రతి సెషన్‌‌లో15 నిమిషాల గైడెడ్ వార్మ్- అప్ ఉంటుంది. దాని తర్వాత స్థాయికి తగిన రూట్లు, డ్రిల్స్‌‌ను ఉపయోగించి 60 నిమిషాల పాటు కోచ్ పర్యవేక్షణలో క్లైంబింగ్ ఉంటుంది. అలసటను తగ్గించడానికి, గాయాల నివారణకు సాయపడటానికి సెషన్15 నిమిషాల కూల్-డౌన్, రికవరీతో ముగుస్తుంది. 

దీనికోసం వాడే షూ ధరలు అధికంగా ఉండటంతో షూను150 రూపాయల అద్దె చెల్లించి తీసుకోవచ్చని క్లబ్ వాలంటీర్లు చెప్పారు. క్లైంబింగ్ ఒక క్రీడ కన్నా ఎక్కువ. ఇది బౌల్డరింగ్, లీడ్, స్పీడ్ అనే మూడు విభాగాలలో బలం, సమతుల్యత, ఏకాగ్రతను పెంపొందించే ఒక సాధన. ప్రతి శైలి శరీరాన్ని, మనసును సవాలు చేస్తుంది. సమన్వయం, సమస్య పరిష్కారం, దృఢత్వాన్ని అభివృద్ధి చేస్తుంది. 

క్లైంబర్స్​కు అధిక నాణ్యత గల డైనమిక్ క్లైంబింగ్ రోప్‌‌లు, క్లైంబింగ్ హార్నెస్, క్లైంబింగ్ షూస్​ను అద్దెకు తీసుకుని కొండలను ఎక్కొచ్చని క్లబ్ ఉపాధ్యక్షుడు విశ్వతేజ చెప్పారు . “మొదటిసారి గోడ ఎక్కేటప్పుడు భయమేసింది.. ఇప్పుడు కొత్త రూట్ కనిపిస్తే దాన్ని పూర్తి చేయాలనే చాలెంజ్‌‌గా తీసుకుంటున్నాం” అంటారు పర్వతారోహకుడు సాయికిరణ్.

మహిళల్లోనూ క్లైంబింగ్ క్రేజ్

సిటీలో క్లైంబింగ్ ఈవెంట్లలో యువకులే కాకుండా వారితో సమానంగా మహిళలు పాల్గొంటున్నారు. ఒలింపిక్ స్పోర్ట్స్​ క్లైంబింగ్​కు ఒలింపిక్స్ అసోసియేషన్ గుర్తించడంతో యువతులు ఈ క్రీడల్లో శిక్షణ పొందటానికి ఆసక్తి చూపిస్తున్నారు. రాక్ క్లైంబింగ్​ను యూత్​కు చేరువ చేసేందుకు తాను శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నానని హైదరాబాద్ క్లైంబర్స్ క్లబ్ అధ్యక్షురాలు డాక్టర్ రేణుక పెచ్చేట్టి చెప్పారు. క్లైంబింగ్​ను కమ్యూనిటీ స్పోర్ట్​గా ప్రమోట్ చేసేందుకు తాను కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆమె వెల్లడించారు. 

హైదరాబాద్ క్లైంబర్స్ సౌత్ ఇండియా క్లైంబింగ్ స్పోర్ట్స్​ పోటీల్లో పాల్గొని అవార్డులు సాధించారని, భవిష్యత్​​లో ఫిట్​నెస్, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం తాము క్లైంబింగ్ యాక్టివిటీని ప్రజల్లోకి తీసుకెళ్లి పాపులర్ చేస్తామని రేణుక వివరించారు. హైదరాబాద్ నగరానికి చెందిన రేణుక ఆస్ట్రోఫిజిసిస్ట్ ప్రొఫెషనల్​గా పనిచేస్తూ గత పన్నెండేళ్లుగా సిటీతోపాటు దేశ, విదేశాల్లో రాక్ క్లైంబింగ్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 

అమెరికా, యూకే, పోలండ్, జర్మనీ దేశాల్లో తాను క్లైంబింగ్ ఈవెంట్లలో పాల్గొన్నానని రేణుక చెప్పారు. ప్రకృతి ఒడిలో పచ్చదనం అందాలను ఆస్వాదిస్తూ కొండలు, గుట్టలపైకి ఎక్కడంలోనే మజా ఉంటుంది. అందుకే యువతే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటోంది రేణుక.