బంగారం, రాగి అన్వేషణలో సింగరేణి.. కర్నాటక మైన్స్ అండ్ జియాలజీ శాఖతో అగ్రిమెంట్

బంగారం, రాగి అన్వేషణలో సింగరేణి.. కర్నాటక మైన్స్ అండ్ జియాలజీ శాఖతో  అగ్రిమెంట్
  • అన్వేషణను ఐదేండ్లలో పూర్తి చేస్తం : సింగరేణి డైరెక్టర్ కె. వెంకటేశ్వర్లు 

హైదరాబాద్, వెలుగు :కర్నాటక రాష్ట్రంలోని రాయచూర్, యాదగిరి జిల్లాల్లో విస్తరించి ఉన్న దేవదుర్గ బ్లాక్​లో బంగారం, రాగి ఖనిజాల అన్వేషణలో సింగరేణి సంస్థ మరో కీలక ముందడుగు వేసింది. ఖనిజాల అన్వేషణకు గతంలోనే లైసెన్స్ పొందిన సింగరేణి.. పనులు ప్రారంభించేందుకు కర్ణాటక రాష్ట్ర మైన్స్ అండ్ జియాలజీ శాఖతో శుక్రవారం ఒప్పందం కుదుర్చుకుంది.

 బెంగళూరులోని కర్ణాటక మైన్స్ అండ్ జియాలజీ శాఖ ఆఫీస్ లో జరిగిన కార్యక్రమంలో కర్ణాటక డీఎంజీ డైరెక్టర్‌‌‌‌ రంగప్ప, సింగరేణి ప్రాజెక్ట్స్​ అండ్​ప్లానింగ్ డైరెక్టర్ కె. వెంకటేశ్వర్లు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. దీంతో దేవదుర్గ ప్రాంతంలోని 199.13 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో బంగారం, రాగి అన్వేషణను ఐదేండ్లలో పూర్తి చేసేందుకు సింగరేణికి అనుమతి లభించింది. 

ఈ సందర్భంగా సింగరేణి ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్ కె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. దేవదుర్గ ప్రాంతంలో బంగారం, రాగి ఖనిజాల అన్వేషణకు సింగరేణి తరపున ఇప్పటికే ఆఫీసర్లను నియమించామని, త్వరలోనే సిబ్బందిని సైతం నియమించి జీ4 అన్వేషణను విజయవంతంగా పూర్తి చేస్తామన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఈ స్థాయిలో ఖనిజ అన్వేషణ చేపట్టడం సింగరేణి చరిత్రలో ఇదే తొలిసారి అని చెప్పారు. కార్యక్రమంలో ఎక్స్‌‌‌‌ప్లొరేష‌‌‌‌న్ జీఎం పంక‌‌‌‌జ్ కుల‌‌‌‌ శ్రేష్ట, డీజీఎం వి.రాజేశ్వర్, డీవైఎఫ్ఎం ల‌‌‌‌క్ష్మీప్రియ‌‌‌‌, సీనియర్ లా ఆఫీసర్ ప్రబంధిత పాల్గొన్నారు.

కొత్తగూడెంలో జియో సైన్స్​ల్యాబ్

కర్ణాటక రాష్ట్రంలో సేకరించిన బంగారం, రాగి శాంపిల్స్​ను పరీక్షించేందుకు కొత్తగూడెంలో సింగరేణి జియోసైన్స్ ల్యాబ్ ను ఏర్పాటు చేశారు. ముందుగా రిమోట్ సెన్సింగ్, జియోలాజికల్ మ్యాపింగ్, జియోఫిజికల్ సర్వేలు నిర్వహించి, ఎంపిక చేసిన ప్రాంతాల్లో స్కౌట్ డ్రిల్లింగ్ చేపట్టనున్నారు. అనంతరం నమూనాలపై పెట్రోగ్రాఫిక్, మినరలాజికల్ అధ్యయనాలు నిర్వహించనున్నారు. తర్వాత పూర్తి రిపోర్ట్ ను కర్ణాటక మైన్స్, జియాలజీ శాఖకు సమర్పించనున్నారు. ఆ నివేదిక ఆధారంగా మరింత విస్తృత స్థాయి అన్వేషణ చేపట్టే అవకాశం ఉంటుందని సింగరేణి ఆఫీసర్లు తెలిపారు.