- శాన్ ఫ్రాన్సిస్కోలో బే ఏరియా పారిశ్రామికవేత్తలతో భేటీ
- ఐటీ, వైద్య, ఇతర వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖ నాయకులు హాజరు
హైదరాబాద్, వెలుగు: పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణ రాష్ట్రాన్ని తమ తొలి ప్రాధాన్యతగా ఎంచుకోవాలని ప్రవాస భారతీయులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయనకు శాన్ ఫ్రాన్సిస్కోలో భారత కాన్సుల్ జనరల్ కె.శ్రీకర్ రెడ్డి శుక్రవారం ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బే ఏరియాలోని ప్రముఖ ప్రవాస భారతీయులతో పాటు ఐటీ, వైద్య, మానవ వనరులు, ఇతర వ్యాపార రంగాలకు చెందిన ముఖ్య నాయకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ఐటీ ఆవిష్కరణల్లో ఇన్నోవేషన్, లైఫ్ సైన్సెస్, గ్లోబల్ సర్వీసెస్ రంగాల్లో హైదరాబాద్ అగ్రగామి టెక్నాలజీ సెంటర్‌గా ఎదుగుతోందని చెప్పారు. ఈ వృద్ధి వేగాన్ని ఇలాగే కొనసాగిస్తూనే, అభివృద్ధి చెందుతున్న సరికొత్త రంగాల్లో పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కోసం కొత్త పునాదులు వేయడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకమైన, పెట్టుబడులకు అనుకూలమైన ప్రగతిశీల అభివృద్ధి నమూనాను అనుసరిస్తోందని చెప్పారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులు, అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థ, జవాబుదారీతనం కలిగిన పరిపాలన తెలంగాణ సొంతమని ఆయన వ్యాఖ్యానించారు.
బే ఏరియా పారిశ్రామికవేత్తలతో భేటీ..
అమెరికా పర్యటన సందర్భంగా శాన్‌ఫ్రాన్సిస్కోలోని బే ఏరియా పారిశ్రామిక వేత్తలతో భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఈ సందర్భంగా, ప్రవాస భారతీయులు, తెలంగాణ ప్రభుత్వాల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరాన్ని భారత కాన్సుల్ జనరల్ శ్రీకర్ రెడ్డి గుర్తుచేశారు. ఇండియాలో సమ్మిళిత ఆర్థిక, సామాజిక అభివృద్ధికి దోహదపడుతూనే, ప్రవాసులకు సైతం ప్రయోజనం చేకూర్చేలా బలమైన భాగస్వామ్యాలను అన్వేషించాలని వ్యాపార వర్గాలను ఆయన కోరారు.
పెట్టుబడులు, సాంకేతిక సహకారం, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ, ఆవిష్కరణలు తదితర అంశాలపై ఎన్నారైలు, బే ఏరియా ప్రతినిధులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్రంతో అమెరికాలోని ప్రవాస భారతీయుల మధ్య బలమైన సంస్థాగత సంబంధాలు ఏర్పరచుకునే దిశగా ఈ సదస్సులో అర్థవంతమైన చర్చలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సింగరేణి సీఎండి జ్యోతి బుద్ధ ప్రకాష్, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్, ఐఓసీ నాయకులు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
