రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడులు.. ఒకేసారి 660 డ్రోన్‌లతో అటాక్

రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడులు.. ఒకేసారి 660 డ్రోన్‌లతో అటాక్
  •  రష్యాలో పలు విమాన సర్వీసులు రద్దు

కీవ్: ఉక్రెయిన్ యుద్ధ వ్యూహాన్ని మార్చింది. రష్యా భూభాగంపై చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో లాంగ్-రేంజ్ డ్రోన్ లతో  దాడులు చేసింది. ఏకకాలంలో రష్యాలోని దాదాపు 12 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని వందలాది డ్రోన్లతో విరుచుకుపడింది. రష్యా రక్షణ శాఖ సమాచారం ప్రకారం.. కేవలం ఒకే రాత్రిలో ఉక్రెయిన్ దాదాపు 660 డ్రోన్లను ప్రయోగించింది. ఇది ఈ యుద్ధంలోనే అతిపెద్ద డ్రోన్ దాడిగా రికార్డు సృష్టించింది. 

ఉక్రెయిన్ ప్రధానంగా రష్యా సైన్యానికి ఇంధనం, ఆయుధాలు అందకుండా చేసే వ్యూహాన్ని అమలు చేస్తోంది. నోవోమోస్కోవ్స్క్‌‌లోని ఒక కెమికల్ ప్లాంట్, హైడ్రోఎలెక్ట్రిక్ ప్లాంట్‌‌లపై దాడులు చేసింది. క్రిమియా తీరంలోని కెర్చ్ పోర్టులో రష్యా నౌకాదళ నౌకలు, రాడార్ వ్యవస్థలను ఉక్రెయిన్ డ్రోన్లు దెబ్బతీశాయి. 

రష్యా రాజధాని మాస్కో వైపు కూడా దాదాపు 47 డ్రోన్లు దూసుకెళ్లాయి. ఈ దాడుల తీవ్రత కారణంగా రష్యా కొన్ని ప్రాంతాల్లో విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపిసింది. కాగా, ఉక్రెయిన్ డ్రోన్ దాడులపై రష్యా సైనిక పరంగా తీవ్రంగా స్పందిస్తోంది. ఉక్రెయిన్ పంపిన 660 డ్రోన్లలో అత్యధిక శాతాన్ని తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ద్వారా కూల్చివేసినట్టు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అలాగే, ఉక్రెయిన్ ఇంధన గ్రిడ్‌‌లు, గ్యాస్ స్టేషన్లపై మరింత తీవ్రం చేసింది.