వేంసూర్, వెలుగు: ఆయిల్ పామ్ సాగులో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానం లో ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు చెప్పారు. ఖమ్మం జిల్లా వేంసూర్ మండలం కల్లూరుగూడెంలో నిర్మిస్తున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనులను సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయితో కలిసి శుక్రవారం పరిశీలించారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఈ ఫ్యాక్టరీని అశ్వరావుపేటలో నిర్మించాలని ఆఫీసర్లు సూచించినప్పటికీ... ఖమ్మం జిల్లాలోనే నిర్మించాలన్న పట్టుదలతో ఇక్కడ మొదలు పెట్టినట్లు చెప్పారు. ఆగస్టు 15 నాటికి ఫ్యాక్టరీ పనులు పూర్తి చేసి ప్రారంభించేలా ఆఫీసర్లు కృషి చేయాలని ఆదేశించారు.
రాబోయే మూడేండ్లలో రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును 10 లక్షల ఎకరాలకు విస్తరించడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి అయినా ఆయిల్ పామ్ కు గ్యారంటీ ధర వచ్చేలా చూస్తామన్నారు.
సత్తుపల్లి మండలం బుగ్గపాడు లో ఉన్న ఫుడ్ పార్క్ కు మరో రెండు పరిశ్రమలు వస్తున్నాయన్నారు. అభివృద్ధిలో ఖమ్మం జిల్లాను ఫస్ట్ ప్లేస్ లో నిలుపుతామని చెప్పారు. కార్యక్రమంలో కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ ఉన్నారు.
