చంద్రయాన్ మిషన్ లో మాతో చేతులు కలపండి.. ఇస్రోకు నాసా ఇన్విటేషన్ 

చంద్రయాన్  మిషన్ లో మాతో చేతులు కలపండి.. ఇస్రోకు నాసా ఇన్విటేషన్ 

అంతరిక్ష ప్రయోగాల్లో భారత్, అమెరికా భాగస్వామ్యం మరింత బలపేతం దిశగా అడుగులు పడుతున్నాయి. చంద్రుడిపైకి మానవులను మళ్లీ పంపే ప్రతిష్టాత్మక మిషన్ ఆర్టిమెస్ లో భాగస్వాములు కావాలని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా.. ఇస్రోకు ఆహ్వానించింది. ఆర్టిమెస్ ఒప్పందంలో భాగంగా రెండు దేశాల మధ్య అంతరిక్ష సహకారాన్ని మరింత విస్తరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా ప్రకటించింది. 

1972 తర్వాత మొదటిసారిగా వ్యోమగాములను చంద్రుని ఉపరితలానికి చేర్చడంతో పాటు, అక్కడ శాశ్వత నివాసం ఏర్పాటు చేయడం ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. చంద్రుడి దక్షిణ ధ్రువం సమీపంలో నాసా ఈ చంద్ర స్థావరాన్ని ఏర్పాటు చేయాలని ఆర్టిమెస్ మిషన్ ను చేపట్టింది. శాస్త్రీయ పరిశోధనలు, కొత్త టెక్నాలజీల అభివృద్ధి, అంతరిక్ష పరిశోధనలకు ఈ స్థావరం ఉపయోగపడనుంది. భవిష్యత్తులో మానవులను అంగారక గ్రహానికి పంపే లక్ష్యానికి కూడా ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుంది.

అంతరిక్ష పరిశోధనలకు సంబంధించిన శాస్త్రీయ సమాచారాన్ని పరస్పరం పంచుకోవడంపై కూడా భారత్‌, అమెరికా చర్చలు జరిపాయి. పౌర, వాణిజ్య అంతరిక్ష రంగాల్లో సహకారాన్ని మరింత పెంచుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. 2023 జూన్ 21న భారత్ ఆర్టెమిస్ ఒప్పందంలో చేరింది. ఈ ఒప్పందంపై సంతకం చేసిన 27వ దేశంగా భారత్ నిలిచింది. 

►ALSO READ | చెదలు పట్టిన రూ.5 లక్షల నోట్లు.. ఆ రైతుకు న్యాయం జరిగేదెలా.. బ్యాంకు కొత్త నోట్లు ఇస్తుందా..?

ఆగస్టు 5, 6 తేదీల్లో బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో జరిగిన భారత్‌-అమెరికా సివిల్ స్పేస్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ 9వ సమావేశంలో ఈ అంశాలపై చర్చలు జరిగాయి. భవిష్యత్తులో మానవ అంతరిక్ష యానం, శాస్త్రీయ పరిశోధనలు, కొత్త అంతరిక్ష టెక్నాలజీల అభివృద్ధిలో ఇరు దేశాల భాగస్వామ్యం మరింత పెరిగే అవకాశం ఉంది.

ఆర్టిమిస్ 1 లోభాగంగా2022 నవంబర్ 16న మానవరహిత ఓరియన్ స్పేస్‌క్రాఫ్ట్ సామర్థ్యాన్ని పరీక్షించింది నాసా.  2026 ఏప్రిల్ లో ఆర్టిమిస్ 2లో భాగంగా నలుగురు వ్యోమగాములు చంద్రుడి చుట్టూ విజయవంతంగా ప్రయాణించి, సురక్షితంగా భూమికి తిరిగి వచ్చారు. ఆర్టెమిస్ 3 ప్రయోగంలో తక్కువ భూ కక్ష్యలో ఓరియన్ నౌకను ల్యాండర్‌తో అనుసంధానించే టెక్నికల్ టెస్టుల ప్రణాళిక చేయబడింది. చంద్రుడి దక్షిణ ధృవంపై వ్యోమగాములను దింపాలని లక్ష్యంగా ఆర్టెమిస్ 4 ప్రయోగాన్ని 2028 చేపట్టాలని నాసా లక్ష్యంగా పెట్టుకుంది.