అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ వ్యక్తి వికలాంగుల పెన్షన్ కోల్పోవాల్సి వచ్చింది. బతికుండగానే చనిపోయినట్లు రికార్డులోకి ఎక్కాల్సి వచ్చింది. కరీంనగర్ జిల్లా మెట్ పల్లిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మెట్పల్లి గ్రామపంచాయతీ పరిధిలో బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు అధికారులు నమోదు చేశారు. రికార్డుల్లో మరణించినట్లు నమోదు కావడంతో వికలాంగుల పింఛన్ ఆగిపోయినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
గత కొన్ని నెలలుగా పెన్షన్ రాకపోవడంతో.. పింఛన్ రావడం లేదని అధికారులను సంప్రదించాడు బాధితుడు. కారణం ఏంటా అని చెక్ చేయగా అసలు విషయం బయటపడింది. తనను చనిపోయినట్లు నమోదు చేయడంపై బాధితుడి ఆందోళన వ్యక్తం చేశాడు. అధికారుల తప్పిదంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశాడు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరాడు. నిలిచిపోయిన వికలాంగుల పింఛన్‌ను వెంటనే పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశాడు. సమస్యను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.
