పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తున్న మోదీ : సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి

పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తున్న మోదీ :  సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి
  •     రాష్ట్రంలో ప్రభుత్వం గాడితప్పకుండా సీఎం జాగ్రత్త పడాలి

చిగురుమామిడి, వెలుగు: దేశం అప్పుల ఊబిలోకి కూరుకుపోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ విధానాలే కారణమని సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి విమర్శించారు. సామాన్యులపై ధరల భారం మోపుతున్న బీజేపీ పాలనకు చరమగీతం పాడాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న సీపీఐ ప్రచార జాతా ఆదివారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని రేకొండ, చిగురుమామిడి, పీచుపల్లి, ముల్కనూర్, సీతారాంపూర్, బాడిపల్లి, ఇందుర్తి, గాగిరెడ్డిపల్లి, ఓగులాపూర్, ముదిమాణిక్యం, రామంచ గ్రామాల్లో పర్యటించింది. హాజరైన చాడ మాట్లాడుతూ.. కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం రోజురోజుకు వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలను విచ్చలవిడిగా పెంచుతోందని.. దీంతో ప్రజల జీవనప్రమాణాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

ALSO READ : పెరగనున్న వెండి హాల్‌‌ మార్కింగ్ టెస్టింగ్‌‌

బీజేపీ అధికారంలోకి వచ్చేనాటికి దేశానికి రూ.55 లక్షల కోట్లకు పైగా అప్పులుంటే ఇప్పుడు అది నాలుగింతలై రూ.214 లక్షల కోట్లకు పైగా చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడంలో నిర్లక్షం చేస్తోందనర్నారు. కమిటీల పేరుతో కాలయాపన చేయడం వల్ల ప్రభుత్వ పాలన గాడితప్పుతుందని, గాడిలో పెట్టుకోవాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిపై ఉందన్నారు. మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, నియోజకవర్గ కన్వీనర్ జాగిరి సత్యనారాయణ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అందె స్వామి, పొనగంటి కేదారి, మండల కార్యదర్శి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.