పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కాంగ్రెస్ సీనియర్ నేత కాడే సూర్యనారాయణ హెచ్చరించారు. మండల కేంద్రంలో ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎంపీ వంశీకృష్ణ పై ధర్మపురి బీజేపీ నాయకులు అసత్య ప్రచారం చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని అనేక సమస్యలను ఎంపీ వంశీకృష్ణ పార్లమెంట్ లో లేవనెత్తుతూ వాటి పరిష్కారం కోసం కృషి చేస్తున్నారని గుర్తుచేశారు.
ధర్మపురిలో నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటుచేయాలని కేంద్రమంత్రిని కోరితే.. దాన్ని నిజామాబాద్ ఎంపీ అరవింద్ జగిత్యాలకు తరలించారని వెల్లడించారు. కాకా వెంకటస్వామి కుటుంబం పెద్దపల్లి పార్లమెంట్ అభివృద్ధి కోసం గత 50 ఏండ్లుగా కృషి చేస్తోందని, ఆ కుటుంబంలోని యువ నాయకుడిపై అసత్య ప్రచారం చేయడం తగదని సూచించారు. సమావేశంలో ఉప సర్పంచ్ ఎలిగేటి మల్లేశం, వార్డు సభ్యుడు దేవి కిశోర్, మాజీ ఉప సర్పంచ్ శంకరయ్య, దేవి లావణ్య, పొన్నం కృష్ణ, మేకల కుమార్ తదితరులు పాల్గొన్నారు.
